విత్తనాల బ్లాక్ దందా.. నష్టపోతున్న రైతులు

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కాగానే విత్తన వ్యాపారులు తమ చేతివాటం మొదలు పెట్టారు. బ్రాండెడ్ కంపెనీల విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్‌పై రూ.300 నుంచి 400 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై చర్యలు చేపడుతున్న అధికారులు అధిక ధరలను నియంత్రించడంపై దృష్టి సారించకపోవడంతో విత్తన వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పెరిగిన విత్తన ధరలోతోనే ఇబ్బందులు పడుతున్న రైతులు బ్లాక్ దందాతో […]

Update: 2021-06-07 14:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం కాగానే విత్తన వ్యాపారులు తమ చేతివాటం మొదలు పెట్టారు. బ్రాండెడ్ కంపెనీల విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో పత్తి విత్తన ప్యాకెట్‌పై రూ.300 నుంచి 400 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై చర్యలు చేపడుతున్న అధికారులు అధిక ధరలను నియంత్రించడంపై దృష్టి సారించకపోవడంతో విత్తన వ్యాపారులు రెచ్చిపోతున్నారు. పెరిగిన విత్తన ధరలోతోనే ఇబ్బందులు పడుతున్న రైతులు బ్లాక్ దందాతో మరింత నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌లో 1,62,42,900 ఎకరాల్లో సాగు అంచనాలుండగా వీటిలో అత్యధికంగా 80లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేయనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది విత్తనాల ధరలను పెంచిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులకు విత్తనాల బ్లాక్ దందా మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని విత్తన ప్యాకెట్లపై కేంద్ర ప్రభుత్వం 10 నుంచి 15శాతం వరకు ధరలను పెంచింది. ప్రధానంగా సాగుచేసే పత్తి విత్తన ప్యాకెట్ (450గ్రాములు) ధర గతేడాది రూ.730 ఉండగా ప్రస్తుతం రూ. 767 వరకు పెంచారు. కంది విత్తనాలు గతేడాది కిలో రూ.83 ఉండగా ఈ ఏడాది రూ. 92.70కి పెంచారు. వరి విత్తనాల్లో 30కిలోల బస్తా వరి ఆర్జీఎల్ (2531) విత్తనాలు గతేడాది రూ.706.50 ఉండగా రూ.835కి పెంచారు. వరి ఎంటీయూ (1121) రకం విత్తనాలు గతేడాది రూ.692.40 ఉండగా రూ.834కు పెంచారు. సోనామసూరి (బీపీటీ 3291)రకం బస్తా రూ. 697 ఉండగా రూ.827కి పెంచారు. ఈ పెరిగిన ధరలతోనే రైతులపై ఆర్థికభారం పడుతుండగా విత్తనాల బ్లాక్ మార్కెట్‌తో రైతులు ఆర్థికంగా మరింత నష్టపోతున్నారు.

బ్లాక్‌లో విత్తన ప్యాకెట్ల విక్రయాలు..

సాగుకు కావల్సినంత విత్తన నిల్వలు అందుబాటులో ఉన్నయని రాష్ట్రం ప్రభుత్వం స్పష్టం చేసినప్పట్టికీ కొందరు దళారులు మార్కెట్‌లో కృత్రిమ విత్తన కొరతను సృష్టిస్తున్నారు. దిగుబడులు అధికంగా వచ్చే బ్రాండెడ్ కంపెనీల విత్తనాల కొరత ఏర్పడిందిని బ్లాక్ మార్కెట్‌కు తెరలేపుతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా సాగుచేసే పత్తి, వరి, కంది విత్తనాలను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. పత్తి విత్తన ప్యాకెట్‌పై రూ.300 నుంచి రూ. 400 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. వరి విత్తనాలు 30 కిలో బస్తాపై 250 నుంచి 300 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కిలో కంది విత్తనాలపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

అధిక ధరలపై దృష్టిసారించిన అధికారులు..

ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు. పురుగుల మందులపై ఉక్కుపాదం మోపుతున్న వ్యవసాయ శాఖ, పోలీసుశాఖ అధికారులు విత్తనాల బ్లాక్ మార్కెట్‌పై దృష్టి సారించడం లేదు. ఫర్టిలేజర్, ఫెస్టిసాయిడ్స్ దుకాణాల్లో విత్తన నిల్వలు, ఇతర స్టాక్ వివరాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించకపోవడంతో వ్యాపారులు బ్లాక్ దందాకు తెరలేపుతున్నారు. బ్లాక్‌లో అధిక ధరలకు రైతులకు విత్తనాలను విక్రయిస్తున్నా కానీ బిల్లుల్లో మాత్రం ఎంఆర్‌పీ ధరలనే నమోదు చేస్తున్నారు. జరుగుతున్నా.. అన్యాయాన్ని ప్రశ్నించిన రైతులకు విత్తానాలు స్టాక్ లేదని చెప్పి విక్రయాలు చేపట్టడం లేదు.

నాణ్యమైన విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం : తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి సాగర్

ప్రభుత్వం వైఫల్యం వలనే విత్తనాలు బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిపడా నాణ్యమైన విత్తనాలను ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడం వలన రైతులు నష్టపోతున్నారు, కొంతమంది వ్యాపారులు బ్రాండెడ్ కంపెనీ విత్తన ప్యాకెట్లలో కూడా నాసీరకం విత్తనాలు చేర్చి విక్రయాలు చేపడుతున్నారు. రైతులు నష్ట పోకుండా ప్రభుత్వం వెంటనే బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలి.

Tags:    

Similar News