దుబ్బాకపై పోస్ట్‌మార్టమ్..

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు వచ్చిన ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీలో సమీక్ష మొదలైంది. ఏయే మండలాల్లో, గ్రామాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయో బూత్‌లవారీ వివరాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి నుంచి పూర్తి గణాంకాలను తీసుకున్న నియోజకవర్గ నేతలు ఎక్కడెక్కడ లోపం జరిగిందో ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం పోలింగ్‌కు మూడ్రోజుల ముందే టీఆర్ఎస్ నేతలకు అందిందని, దానికి అనుగుణంగా గల్లీ లీడర్ల నుంచి […]

Update: 2020-11-11 20:42 GMT

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడిపోవడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు వచ్చిన ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీలో సమీక్ష మొదలైంది. ఏయే మండలాల్లో, గ్రామాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయో బూత్‌లవారీ వివరాలను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి నుంచి పూర్తి గణాంకాలను తీసుకున్న నియోజకవర్గ నేతలు ఎక్కడెక్కడ లోపం జరిగిందో ఆరా తీయడం స్టార్ట్ చేశారు. ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం పోలింగ్‌కు మూడ్రోజుల ముందే టీఆర్ఎస్ నేతలకు అందిందని, దానికి అనుగుణంగా గల్లీ లీడర్ల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకున్నట్టు తెలిసింది. అయితే అంతా బాగానే ఉందంటూ స్థానిక నాయకులు ఇచ్చిన సమాచారమే చివరకు కొంప ముంచిందని ఫైనల్‌గా తేలినట్టు తెలుస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక నియోజకవర్గంలో ప్రతికూల ఫలితం రావడంతో పాటు ఓటర్లు బీజేపీవైపు మళ్ళడానికి కారణాలపై టీఆర్ఎస్‌ పార్టీలో అధ్యయనం మొదలైంది. ఏ సెక్షన్ ప్రజలు.. ఎందుకు దూరమయ్యారు? సంక్షేమ పథకాలు అందుకునే మేరకైనా ఓట్లు ఎందుకు పడలేదు? ఏయే గ్రామాల్లో.. ఏయే అంశాలు దూరం కావడానికి దోహదపడ్డాయి? గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి బలంగా ఉన్న గ్రామాల్లోని ఓట్లు ఈసారి ఏ మేరకు దూరమయ్యాయి? అందుకు కారణాలేంటి? బీజేపీవైపు మరలడానికి నిర్దిష్టంగా క్షేత్రస్థాయిలోని అంశాలేంటి..? ఇలా అనేక కోణాల నుంచి లోతైన విశ్లేషణ మొదలైంది. ముఖ్యమంత్రికి కూడా బూత్‌లవారీ ఓట్ల వివరాల నివేదిక వెళ్ళినట్టు నియోజకవర్గ నేత ఒకరు తెలిపారు.

తప్పుడు సమాచారమిచ్చారా?

ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాలకు వచ్చిన హరీశ్‌రావు ఎప్పటికప్పుడూ అక్కడ వాస్తవిక పరిస్థితి గురించి ఆరా తీసేవారు. అయితే ఎక్కువగా పార్టీ నేతలు, పాత్రికేయుల నుంచి సమాచారం తీసుకోవడంతో ‘అంతా బాగానే ఉంది’ అనే స్పందనే లభించిందని, దీంతో సీరియస్‌గా దృష్టి పెట్టలేదని స్థానిక నేత ఒకరు తెలిపారు. నిజానికి ఆ రోజు ఉన్న పరిస్థితిని ఉన్నదున్నట్లుగా చెప్పినట్లయితే అప్పుడే దిద్దుబాటు చర్య మొదలై ఓటమి నుంచి బైటపడేవారమని ఇప్పుడు అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలోనే సోషల్ మీడియా ప్రభావం బీజేపీపై గణనీయంగా ఉందని, అది ఏదో ఒక రూపంలో ఇబ్బందికరంగా మారుతుందని ఆ రోజే గమనించామని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. హరీశ్‌రావు చుట్టూ ఉండే నియోజకవర్గ నాయకులంతా ఆయన మెప్పు కోసం ప్రయత్నించేవారని, సంతృప్తికరమైన అంశాలను మాత్రమే చెప్పి ఆయన దృష్టిలో పడుతుంటారని, పార్టీకి ఇబ్బందికరంగా ఉండే అంశాలను చెప్తే నలుగురిలో ఒకరిగా దూరమవుతామన్న ఉద్దేశంతో ‘అంతా అనుకూలమే’ అని చెప్పక తప్పలేదని, కానీ ప్రజల మధ్య తిరుగుతున్న తనలాంటి గ్రామ స్థాయి కార్యకర్తలకు పరిస్థితి గురించి ముందే అవగాహన ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని దుబ్బాక పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు.

ఆజ్యం పోసిన అసంతృప్తి

గతంలో పంచాయతీ, సహకార ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించిన చాలామంది నేతలు ఇప్పుడు పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ అసంతృప్తిని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కన్విన్స్ చేసే ప్రయత్నం జరగలేదనేది వారిలో ఉంది. జిల్లా మంత్రిగా హరీశ్‌రావు ఉన్నా ఆశించింది లభించలేదన్న అసంతృప్తిని తొగుట గ్రామానికి చెందిన కార్యకర్త ఒకరు వ్యాఖ్యానించారు. అవసరమైనప్పుడు పార్టీ తరపున సాయం అందించలేని జిల్లా, నియోజకవర్గ నేతలు ఇప్పుడు ఎన్నికల సమయంలో మాత్రం దగ్గరకు పిలిచి మాట్లాడుతున్నారని, తనలాగే అసంతృప్తితో ఉన్న చాలా మంది ప్రచారం సమయంలో పూర్తిస్థాయిలో మనసు పెట్టలేదని చెప్పారు.

సోషల్ మీడియాను వాడుకోవడంలో విఫలం..

నియోజకవర్గంలోని యువత బీజేపైవైపు మళ్ళడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా అనేది టీఆర్ఎస్ స్థానిక నేతల విశ్లేషణలో తేలింది. బీజేపీ తరహాలో టీఆర్ఎస్‌కు బలమైన సోషల్ మీడియా లేకపోవడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, ప్రత్యేకతలను ప్రచారం చేసుకోలేకపోయామని, బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయామని ఆ పార్టీ కార్యకర్త ఒకరు తెలిపారు. గ్రామీణ స్థాయిలోనూ ప్రజలు స్మార్ట్ ఫోన్లను విస్తృతంగా వాడుతున్నందున ఇకపైన బీజేపీ తరహాలోనే టీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాను వాడుకోవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News