దూకుడు పెంచిన బీజేపీ.. ఆ 19 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్
దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి..’ అంటూ బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఇచ్చిన సంకేతాలతో రాష్ట్ర నాయకత్వం దూకుడు పెంచింది. ఈ క్రమంలో తొలుత ఎస్సీ రిజర్వ్‌డు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు దళిత నేతలతో ఓ ప్రైవేటు హోటల్‌లో చింతన్ బైఠక్ నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో : ‘ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి..’ అంటూ బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఇచ్చిన సంకేతాలతో రాష్ట్ర నాయకత్వం దూకుడు పెంచింది. ఈ క్రమంలో తొలుత ఎస్సీ రిజర్వ్‌డు నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ మేరకు దళిత నేతలతో ఓ ప్రైవేటు హోటల్‌లో చింతన్ బైఠక్ నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ‘దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి’ అనే నినాదం మొదలు ఎస్సీలకు ఏయే సందర్భాల్లో ఎలాంటి హామీలు ఇచ్చారు? ఇప్పుడు వాటి అమలు ఏ స్థాయిలో ఉన్నది? తదితర విషయాలను ప్రజల్లో వీలైనంత లోతుగా ఎక్స్‌పోజ్ చేయడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
పార్టీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దళిత సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ ప్రస్తుతం దళితబంధు పథకాన్ని హైలైట్ చేస్తున్నందున దళితుల కోసం ఏడేండ్లలో ఆయన దళిత నియోజకవర్గాలకు ఎంత ఖర్చు చేశారు, ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి, ఆ కమ్యూనిటీకి జరిగిన అన్యాయం తదితరాలన్నింటిపైనా చర్చ జరిగింది. ప్రచారంలోకి వెళ్లినప్పుడు ఈ నియోజకవర్గాల్లో ఆ అంశాలను, కేసీఆర్ వైఫల్యాలను విస్తృతంగా వివరించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. రిజర్వ్‌డు నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, దళితులు ప్రస్తుతం ఎటువైపు ఉన్నారు, ఏం చేస్తే బీజేపీవైపు మళ్లుతారు.. అనే అంశాలపై లోతైన చర్చ జరిగింది.
ఎన్నికలు జరిగితే ఆ నియోజకవర్గాల్లో బలమైన పోటీ ఏయే పార్టీల మధ్య ఉంటుంది, ఏ అభ్యర్థుల మధ్య ఉంటుంది, బీజేపీకి బలమైన అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి, ఇతర పార్టీల అభ్యర్థులను ఢీ కొట్టగలిగే ప్రధానాంశం ఏంటి తదితరాలపై కూడా సంజయ్ ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా బీజేపీ సహా వివిధ పార్టీల తాజా పరిస్థితి, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై లోతుగా చర్చించారు. దళితులకు కేసీఆర్ హామీ ఇచ్చి విఫలమైన అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, ఇప్పుడు దళితబంధు పథకాన్ని ఏ కారణంతో తీసుకొచ్చారో వివరించి దాన్ని పటిష్టంగా అమలుచేసేలా ఆ పార్టీపై ఒత్తిడి పెంచాలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది.
వచ్చే ఎన్నికలే లక్ష్యం..
రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం లక్ష్యమైనందున మొత్తం 19 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపు చాలా కీలకమని వారికి సంజయ్ సూచించారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యతిరేకత, వివిధ ప్రాంతాల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ ఈ నియోజకవర్గాల్లో ఏ మేరకు ప్రభావం చూపనున్నది? దాన్ని మరింత పెంచడానికి అవలంభించాల్సిన పద్ధతులు.. రూపొందించాల్సిన వ్యూహం.. ప్రజల మనస్సులను గెల్చుకోడానికి ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. దళితుడిని రాష్ట్రపతిని చేయడంలో బీజేపీ పోషించిన పాత్రను హైలైట్ చేయాలన్న నిర్ణయం జరిగింది. గత పార్లమెంటు ఎన్నికల్లో దేశం మొత్తం మీద బీజేపీ 46 నియోజకవర్గాల్లో గెలిచిందని, కాంగ్రెస్ మాత్రం ఐదు స్థానాలకే పరిమితమైందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని 19 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ దళితులకు దగ్గర కావాలని సూచించారు. సమిష్టి కార్యాచరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని నొక్కిచెప్పారు.
అటు కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఆసక్తి లేకపోవడం, ఇటు అధికార టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత బీజేపీకి కలిసొచ్చే అంశమని, వారికి ఇప్పటి పరిస్థితుల్లో కమలం పార్టీ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని వివరించారు. దళితుల మీద ప్రేమను కనబరుస్తున్న సీఎం కేసీఆర్ ఏడేళ్ళలో ఏయే దళిత నియోజకవర్గానికి కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, కనిపిస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లో బహిర్గతం చేయాలని సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ విజయ రామారావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి, ఉఫాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తదితరులు పాల్గొన్నారు.