హైదరాబాద్ ఆమ్దాని ఎక్కడికెళ్లిందో.. కేసీఆర్ సమాధానం చెప్పాలి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పేగులు తెగేలా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లుగా ఎవరి పాలయిందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె ప్రభుత్వ భూములను అమ్మకాలకు పెడుతున్న నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ భూములు అంటేనే ప్రజల సొమ్ము అని.. అలాంటి ప్రజా సొమ్మును అమ్మే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిది అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర ఆదాయాన్ని ఆంధ్రాకు […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పేగులు తెగేలా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏడేళ్లుగా ఎవరి పాలయిందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె ప్రభుత్వ భూములను అమ్మకాలకు పెడుతున్న నేపథ్యంలో ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ భూములు అంటేనే ప్రజల సొమ్ము అని.. అలాంటి ప్రజా సొమ్మును అమ్మే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిది అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర ఆదాయాన్ని ఆంధ్రాకు కట్టబెడుతున్నారని గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం ఎక్కడికెళ్ళిందో చెప్పాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సింది పోయి అమ్మాలనే ఆలోచన రావడం ఆందోళన కరమన్నారు. ఎవరికి కట్టబెట్టడం కోసం భూములను అమ్ముతున్నారో చెప్పాలన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది.. ఇవాళ రూ. 4 లక్షల కోట్ల అప్పు ఎలా అయ్యిందో తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పుడు అదనపు కలెక్టర్లకు లగ్జరీ కార్ల కొనుగోలు ఎందుకో చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూముల విక్రయాన్ని ఆపాలని లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశానని ఒప్పుకుని ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.