మానుకోటలో టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు కీలక నేతలు!
దిశ ప్రతినిధి, వరంగల్: మానుకోటలో కాంగ్రెస్ పార్టీ స్వింగ్‌లోకి వచ్చేసింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వైఖరితో పాటు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తూ కొంతమంది కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. మంగళవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి సమక్షంలో 200 మంది హస్తం గూటికి చేరడం గమనార్హం. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చుక్కల ఉదయ్ చందర్, కొంతమంది సీపీఐ, సీపీఎం నాయకులు సైతం చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల […]
దిశ ప్రతినిధి, వరంగల్: మానుకోటలో కాంగ్రెస్ పార్టీ స్వింగ్‌లోకి వచ్చేసింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ వైఖరితో పాటు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఆరోపిస్తూ కొంతమంది కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. మంగళవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి సమక్షంలో 200 మంది హస్తం గూటికి చేరడం గమనార్హం. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన చుక్కల ఉదయ్ చందర్, కొంతమంది సీపీఐ, సీపీఎం నాయకులు సైతం చేరేందుకు చర్చలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన రెడ్యాల సర్పంచ్, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు, ఉద్యమ నేత వెన్నం శ్రీకాంత్‌రెడ్డి గులాబీ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ధోరణితో పాటు ఉద్యమ కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పనిచేసినా పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. గులాబీ బాస్ కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. ఈ పరిణామం తర్వాత రెండ్రోజులకే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్‌లో ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరిక ఖాయమైంది.
త్వరలో మజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య
మానుకోట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య కూడా త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆయనకు కూడా పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం తర్వాత పార్టీ మారాలని అనుచరుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయానికి వచ్చారని, త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరిన కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు. రేవంత్‌తో శ్రీరాం భద్రయ్యకు సత్సంబంధాలున్నాయి. అంతేగాక శ్రీరాంభద్రయ్య చేరికపై రేవంత్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన పార్టీలో చేరితే ఖచ్చితంగా పార్టీకి ఎంతో ఉంటుందని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.
ఉద్యమ నేతలు.. అసంతృప్తులే టార్గెట్
ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ కనీస గౌరవం దక్కకుండా అసంతృప్తితో ఉన్న నేతలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే అనేకమంది మండల స్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నారు. అంతేగాకుండా.. త్వరలోనే భారీ బలగంతో కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధం అవుతున్నారని ‘దిశ’కు వివరించారు. రానున్న రెండు, మూడు నెలల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా చేరికలుంటాయని, ఉగాది నాటికి కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ అధినేతలు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. కారు పార్టీని వీడుతున్న క్యాడర్ మొత్తం శంకర్‌నాయక్ వైఖరి మూలంగానే వీడుతున్నట్లు ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. మానుకోట టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం ఎప్పటికప్పుడు ‘వేగుల’ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. స్వింగ్‌లోకి వచ్చేస్తున్న కాంగ్రెస్‌ను కారు పార్టీ ఎలా కట్టడి చేయనుంది..? ఎమ్మెల్యే వైఖరిపై నేతలు చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు..? సమాధానంతో మెప్పించి, ఒప్పించి క్యాడర్‌ను కాపాడుకుంటారా..? లేదా అన్నది వేచి చూడాలి.