వరంగల్‌లో బట్టబయలైన బడా బాగోతం..
దిశ ప్రతినిధి, వరంగల్ : ఓరుగల్లులో చిట్‌ఫండ్ కంపెనీల రియల్ వ్యాపారం అడ్డగోలుగా సాగుతోంది. చీటీ గడువు ముగిసినా.. నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఆఫర్ ఇచ్చి.. అన్యాయం చేసేస్తున్నాయి. పొదుపుదారులకు ఇష్టం లేకున్నా బలవంతంగా ప్లాట్లను కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి. ఓరుగల్లు నగరానికి సుదూర ప్రాంతాల్లోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. కొందరికైతే మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ఏరియాలలో అనుమతుల్లేని వెంచర‌్లల్లో ప్లాట్లను […]
దిశ ప్రతినిధి, వరంగల్ : ఓరుగల్లులో చిట్‌ఫండ్ కంపెనీల రియల్ వ్యాపారం అడ్డగోలుగా సాగుతోంది. చీటీ గడువు ముగిసినా.. నెలల తరబడి డబ్బులు చెల్లించకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటూ ఆఫర్ ఇచ్చి.. అన్యాయం చేసేస్తున్నాయి. పొదుపుదారులకు ఇష్టం లేకున్నా బలవంతంగా ప్లాట్లను కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి. ఓరుగల్లు నగరానికి సుదూర ప్రాంతాల్లోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకుంటున్నాయి. కొందరికైతే మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ఏరియాలలో అనుమతుల్లేని వెంచర‌్లల్లో ప్లాట్లను అంటగడుతున్నారు. ఆ ఏరియాలోని మార్కెట్ రేటు కన్నా డబుల్ గుంజుతున్నారు. చీటీ గ్రూపు సభ్యులకు గడువు ముగిసినా ఓ పట్టాన నగదు ఇవ్వకుండా అనేక అవాంతరాలు సృష్టించి.. వారికే విసుగు, భయం పుట్టేలా చేసి ప్లాట్ల కొనుగోలు వైపు తతంగాన్ని నడుపుతున్నారు.
వరంగల్‌లో 200లకు పైగా చిట్‌ఫండ్ కంపెనీలు..
హన్మకొండలోని చిట్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 200లకు పైగా చిట్‌ఫండ్ కంపెనీలు ఉన్నాయి. వరంగల్, కాజీపేట, హన్మకొండలలో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నవి 140 వరకు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి. కోట్లాది రూపాయాలను చీటీల రూపంలో వసూలు చేస్తూ, శివారుల్లో వందలాది ఎకరాల కొనుగోలుకు వినియోగిస్తున్నాయి. చిట్‌ఫండ్, రియల్ వ్యాపారాల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకుల పెట్టుబడులు ఉంటున్నాయి. చిట్‌ఫండ్‌ల్లోని డబ్బంతా రియల్ వ్యాపారంలో పెట్టుబడిగా మారుతోంది. జనాలకు కాసింత వడ్డీ, డివిడెండ్ ఆశచూపి చీటీల వైపు ఆకర్షిస్తున్న యాజమాన్యాలు, ఆ డబ్బుతో కోట్ల సంపాదనకు జనం డబ్బులను వినియోగించుకుంటున్నాయి.
వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్…
హన్మకొండలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ చిట్‌ఫండ్ కంపెనీ మోసం అంతా ఇంతా కాదు. చీటీ గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా సభ్యులను ముప్పుతిప్పలు పెట్టింది. కొంతమంది సంస్థ కార్యాలయంలో ఆందోళనకు దిగడంతో వారికి చెక్కులను అందజేసింది. కంపెనీ ఖాతాలో డబ్బు లేకపోవడంతో ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. చేసేదేం లేక చిట్‌ఫండ్ యాజమాన్యంతో సభ్యులు రాజీకొచ్చారు. డబ్బులకు సరిసమానమైన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి తన అనుబంధ వ్యాపార సంస్థ పేరుతో జనగామ పట్టణ శివారులోని ఓ గ్రామంలోని వ్యవసాయ భూములను ప్లాట్లుగా చూపింది.
ఎలాంటి అనుమతి పొందని ఆ లేఅవుట్‌లో, కొంత భూమి వివాదాస్పదంలో ఉంది. ఆ వివరాలు తెలియజేయకుండానే సభ్యులకు రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విషయం తెలియగానే గ్రామానికి చెందిన కొంతమంది ఆ భూమి తమదంటూ కోర్టుకెళ్లారు. ఇప్పుడు ఆ భూములపై వివాదం కొనసాగుతోంది. పొదుపు చేద్దామని చేరితే లక్షలాది రూపాయలు పోయాయని, ప్లాట్ల పేరుతో మోసపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.