సర్కస్‌లో జీవులకు ఆధారం.. సింహాల మలం
దిశ, వెబ్‌డెస్క్: అమ్మే తెలివి ఉండాలే గానీ.. ఆకాశంలో చంద్రుడిని, అంగట్లో తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు. కవితకు కాదేదీ అనర్హమని శ్రీశ్రీ అన్నట్టు, అమ్మడానికి కూడా కాదేదీ అనర్హమని ఎందరో నిరూపిస్తున్నారు. తాజాగా జర్మనీలోని మ్యూనిచ్‌లో ‘క్రోనే’ సర్కస్ నిర్వాహకులు ‘సింహం’ మలాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే, ప్రజలు క్యూలో నిల్చుని కొనకపోయినా.. మంచి లాభాలే వస్తున్నాయని క్రోనే వాళ్లు చెబుతుండటం విశేషం. కరోనా సంక్షోభం ఏ రంగాన్ని వదిలిపెట్టలేదని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అన్ని వ్యాపారాలు, […]
దిశ, వెబ్‌డెస్క్: అమ్మే తెలివి ఉండాలే గానీ.. ఆకాశంలో చంద్రుడిని, అంగట్లో తాజ్‌మహల్‌ను కూడా అమ్మేస్తారు. కవితకు కాదేదీ అనర్హమని శ్రీశ్రీ అన్నట్టు, అమ్మడానికి కూడా కాదేదీ అనర్హమని ఎందరో నిరూపిస్తున్నారు. తాజాగా జర్మనీలోని మ్యూనిచ్‌లో ‘క్రోనే’ సర్కస్ నిర్వాహకులు ‘సింహం’ మలాన్ని అమ్మకానికి పెట్టారు. అయితే, ప్రజలు క్యూలో నిల్చుని కొనకపోయినా.. మంచి లాభాలే వస్తున్నాయని క్రోనే వాళ్లు చెబుతుండటం విశేషం.
కరోనా సంక్షోభం ఏ రంగాన్ని వదిలిపెట్టలేదని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే అన్ని వ్యాపారాలు, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. టూరిస్ట్ ప్లేస్‌లు, ఆ ప్లేసుల్లో చిన్నా చితకా వ్యాపారాలు చేస్తున్నవారంతా అప్పుల్లో మునిగిపోయారు. ఇక ఇంట్లో నుంచి జనాలు బయటకొస్తున్నా.. సమూహ ప్రాంతాలకు వెళ్లడం లేదు. దాంతో సర్కస్‌కు ఆదరణ లేకుండా పోయింది. దీంతో ఆదాయం లేక, సర్కస్‌లోని జంతువులకు ఆహారం పెట్టలేని స్థితి ఏర్పడింది. జర్మన్‌కు చెందిన క్రోనే సర్కస్ నిర్వాహకులది కూడా అదే పరిస్థితి. ఇలాంటి టైమ్‌లో ఓ ఐడియా వాళ్ల జీవితాలను మార్చలేకపోయినా.. జంతువుల కడుపు నింపడానికి మాత్రం ఉపయోగపడుతోంది. అదే సింహం, పులుల మలాన్ని విక్రయించడం. ఇందుకోసం సర్కస్‌లోని 26 సింహాలు, పులుల మలాన్ని ఓ బాటిల్‌లో నింపి అమ్మేస్తున్నారు. ఒక్కో బాటిల్‌కు ఐదు యూరోల (రూ. 440) చొప్పున అమ్ముతున్నారు. ఇదంతా ఓకే కానీ.. వాటి మలంతో ఏంటీ ఉపయోగం అంటారా? వాటి మలం ఉన్నచోటుకి పిల్లులు రావట. అంతేకాదు, వాటి మలం పురుగుల మందులా కూడా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. మొదట సర్కస్ దగ్గరే అమ్మకాలు చేపట్టినా, కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఆన్‌లైన్ అమ్మకాలను కూడా మొదలు పెట్టారు. అందుకే చెప్పేది.. ‘శతకోటి సమస్యలకు.. అనంతకోటి ఉపాయాలని’.