మూడు నియోజకవర్గాలకే ముఖ్యమంత్రివా.. కోమటిరెడ్డి ఆగ్రహం
దిశ, జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. శనివారం జనగామ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఎంపీ మీడియాతో కేవలం ఈ మూడు నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ ఇతర నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో రూ.వేల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తూ ఇతర ప్రాంతాలకు నిధుల కొరత అంటున్నారని మండిపడ్డారు. ఇది […]
దిశ, జనగామ: ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. శనివారం జనగామ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఎంపీ మీడియాతో కేవలం ఈ మూడు నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ ఇతర నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో రూ.వేల కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తూ ఇతర ప్రాంతాలకు నిధుల కొరత అంటున్నారని మండిపడ్డారు. ఇది తగదని అన్ని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలను ఒకే విధంగా చూడాలన్నారు. తెలంగాణ వచ్చి ఏడేళ్లు దాటినా అనుకున్న అభివృద్ధి జరగలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆశయం నేరవేరే వరకు సర్కార్‌పై యుద్ధం చేస్తూనే ఉండాలన్నారు. సీఎం మీద ఒత్తిడి తీసుకొచ్చి జనగామ జిల్లా కేంద్రానికి అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు.
జనగామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జనగామ జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లవుతున్నా.. ఇంతవరకూ పట్టణ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని విమర్శించారు. వెంటనే జనగామా అభివృద్ధికి నిధులు కేటాయించి, పనులు జరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే, అమరవీరుల సాక్షిగా మరో ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. రాజకీయాలు పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకోచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. జనగామ రైల్వేస్టేషన్‌పై నుంచి బ్రిడ్జి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధుల కేటాయిస్తే వెంటనే పనులు ప్రారంభమవుతాయి. కానీ, అందుకు కేసీఆర్ సర్కార్ ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకున్నా సిద్దిపేట కన్న అద్భుతంగా జనగామను అభివృద్ధి చేస్తామని వివరించారు. అంతకు ముందు మున్సిపల్ సమావేశంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో జనగామ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎంపీకి కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు.