కోకోనట్ షెల్స్‌లో ‘మినీ జంగల్’
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటి ఆవరణలో నీడనిచ్చే చెట్లు, ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలు ఉన్నట్లయితే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. నిజానికి ఇలాంటి అట్మాస్పియర్ గాలి నాణ్యతను పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ కలిగిస్తుంది. కానీ, ప్రజెంట్ ఇళ్ల నిర్మాణాలకు ఇస్తున్న ప్రాధాన్యత, మొక్కల పెంపకానికి ఇవ్వడం లేదు. గ్రామాల్లో అక్కడక్కడా ఇలాంటి వాతావరణం కనిపిస్తున్నా..పట్టణాలు, నగరాల్లో అయితే ఆ చాన్సే లేదు. ఎందుకంటే ఎటుచూసినా కాంక్రీటు నిర్మాణాలే. అయితే ఈ మధ్య నగరాల్లోనూ మిద్దె […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇంటి ఆవరణలో నీడనిచ్చే చెట్లు, ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలు ఉన్నట్లయితే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. నిజానికి ఇలాంటి అట్మాస్పియర్ గాలి నాణ్యతను పెంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ కలిగిస్తుంది. కానీ, ప్రజెంట్ ఇళ్ల నిర్మాణాలకు ఇస్తున్న ప్రాధాన్యత, మొక్కల పెంపకానికి ఇవ్వడం లేదు. గ్రామాల్లో అక్కడక్కడా ఇలాంటి వాతావరణం కనిపిస్తున్నా..పట్టణాలు, నగరాల్లో అయితే ఆ చాన్సే లేదు. ఎందుకంటే ఎటుచూసినా కాంక్రీటు నిర్మాణాలే. అయితే ఈ మధ్య నగరాల్లోనూ మిద్దె తోటలకు ప్రాధాన్యత పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భోపాల్‌కు చెందిన ఓ మహిళ 450 జాతులకు చెందిన 4,000 మొక్కలతో తన ఇంటి వెనకాల ఓ ‘మినీ జంగల్’ను సృష్టించింది. వీటిలో 150 వరకు విలక్షణ రకానికి చెందిన మొక్కలుండగా, వాటిని తాగిపడేసిన కొబ్బరిబోండాలు, రీసైకిల్ చేసిన బాటిళ్లలో పెంచుతుండటం విశేషం.
భోపాల్‌కు చెందిన సాక్షి భరద్వాజ్..2019 నుంచి మానసరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ అగ్రికల్చర్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. విద్యార్థులకు మొక్కల జన్యుశాస్త్రం గురించి కాన్సెప్టులు వివరించే క్రమంలో తనకు కూడా మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. ఈ విషయాలు ప్రాక్టికల్‌గా తెలిస్తే, టీచింగ్ సులభమవుతుందని భావించి ఇంటి దగ్గర కొన్ని మొక్కలను పెంచడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో కొమ్మలను అంటుకట్టే పద్ధతి ద్వారా కొత్త మొక్కలను పెంచడమే కాకుండా నిమ్మజాతికి చెందిన తొక్కలను ఉపయోగించి బయో-ఎంజైమ్స్ తయారీ, బొప్పాయి, వేప ఆకులతో వర్మి కంపోస్ట్ తయారీలో ప్రయోగాలు చేపట్టింది.
విలక్షణ రకాల మొక్కల పెంపకం..
అప్పటి వరకు మందారం, గులాబీ వంటి సాధారణ మొక్కల్ని పెంచిన సాక్షి.. 2020 ప్రారంభంలో సోషల్ మీడియా ద్వారా ఒక అర్బన్ గార్డెనింగ్ కమ్యూనిటీ పెంచుతున్న విలక్షణ మొక్కలను గురించి తెలుసుకుంది. తను కూడా నర్సరీల నుంచి తెచ్చిన కొన్ని రకాల తీగ జాతులతో పాటు మాన్‌స్టెరా, ఫిలోడెండ్రాన్, బిగోనియా వంటి మొక్కలను సిమెంట్ కుండీల్లో పెంచడం మొదలుపెట్టింది. వాటికి సేంద్రియ మట్టిలో వర్మికంపోస్ట్‌ను కలిపి అందజేయడంతో పాటు క్రమం తప్పకుండా నీరు పట్టేది. సిమెంట్ కుండీల్లో మొక్కలు బాగానే పెరుగుతున్నప్పటికీ, కుండీల ఖర్చు తగ్గించుకునేందుకు సాక్షి..కొత్తగా ఆలోచించింది. మొక్కలను పెంచే కుండీలు ఎకో ఫ్రెండ్లీగా ఉండాలని నిర్ణయించుకుంది. తాగిపడేసిన కొబ్బరిబోండాల్లో కొత్త మొలకలను పెంచాలని నిర్ణయించుకుంది. వాటితో నీటి నిలుపుదలకు సరైన పరిష్కారం లభించడంతో పాటు అవి పగిలిపోయే అవకాశం లేకపోవడం కూడా ప్లస్ అయ్యింది.
వర్టికల్ గార్డెన్ క్రియేషన్..
సాక్షి.. తన ఆలోచన అమలు చేయడంలో భాగంగా తాగిపడేసిన కొబ్బరిబోండాలను సేకరించిన వాటి లోపల క్లీన్ చేసి, ఆరబెట్టింది. వాటి పైభాగంలో రెండు రంధ్రాలుచేసి తాళ్లతో గోడకు వేలాడదీసింది. అందులో సేంద్రియ మట్టి, వర్మికంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ నింపి, మొలకలను నాటింది. ‘కొబ్బరి చిప్పలను క్లీన్ చేసి, మొలకలను నాటేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. వీటిలో మొక్కలన్నీ ఎలాంటి చీడలు లేకుండా పెరుగుతున్నాయి. కొబ్బరి చిప్పల్లోని సహజ వనరులు మొక్కలకు పోషకాల రూపంలో అందుతుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు నా గార్డెన్‌లో 450 రకాల జాతులకు చెందిన 4,000 మొక్కలున్నాయి. అందులో ఫిలోడెండ్రాన్స్, మాన్‌స్టెరా, బిగోనియాస్, కలాథియా, పామ్స్, పెపెరోమియా, ఫికస్, ఎపిప్రెమ్నం, సాన్సేవిరియా, క్లోరోఫైటం, అగ్లోనెమా వంటి 150 రకాల విలక్షణమైన మొక్కలు కూడా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది సాక్షి.
కొబ్బరిచిప్పల్లోనే కాకుండా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్లలోనూ మొక్కలను పెంచుతున్న సాక్షి.. అవి ఆకర్షణీయంగా కనిపించేలా వాటర్ రెసిస్టెంట్ పెయింట్ వేసింది. వీటితో పాటు మిల్క్ ప్యాకెట్లను కూడా విత్తనాలను మొలకెత్తించేందుకు పాలీబ్యాగ్స్‌గా ఉపయోగిస్తోంది. సాక్షి స్పెషల్ గార్డెన్ గురించి మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే లేదా అక్కడి విలక్షణ మొక్కలను కొనుగోలు చేయాలంటే తనను ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా సంప్రదించొచ్చు.