‘భీమ్లానాయక్’ సింగర్ గురించి మీకు తెలియని విషయాలు..
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : అరుదైన 12 మెట్ల కిన్నెర తంత్రాలను వాయిస్తూ.. తన గాత్రంతో ఆకట్టుకుంటూ.. పండిత పామరులను మెప్పించిన మొగులయ్యకు సినీ పాట పాడే అరుదైన అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌కు సంబంధించి పాడిన పల్లవి శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటుంది.. అతని గాత్రం.. సంగీతానికి తగినట్టుగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలతో సాగిన ఆ పాట గురువారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : అరుదైన 12 మెట్ల కిన్నెర తంత్రాలను వాయిస్తూ.. తన గాత్రంతో ఆకట్టుకుంటూ.. పండిత పామరులను మెప్పించిన మొగులయ్యకు సినీ పాట పాడే అరుదైన అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో హీరో ఇంట్రడక్షన్‌కు సంబంధించి పాడిన పల్లవి శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటుంది.. అతని గాత్రం.. సంగీతానికి తగినట్టుగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలతో సాగిన ఆ పాట గురువారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విడుదలై అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. మొగులయ్య స్వరం నుండి జాలువారిన భీమ్లా నాయక్ సినిమాలోని పల్లవి ఇదే.
శభాష్..
ఆడగాదు… ఈడాగాదు
అమీరోళ్ల.. మేడా గాదు
గుర్రపు నీళ్ల గుట్ట కాడ
జెమ్మ జెముడు చెట్టున్నాది
జెమ్మ జెముడు చెట్టు కింద
అమ్మ నొప్పులు వడ్తున్నాది
ఎండా లేదు… రాత్రి కాదు
ఎగుసుక్క ఒడువంగానే
పుట్టిండాడు పులి పిల్ల
పుట్టిండాడు పులి పిల్ల
నల్లమల తాలూకాల
అమ్మ పేరు మీరా బాయి
నాయిన పేరు సోమ్లా గండు
నాయినపేరు సోమ్లా గండు
తాత పేరు బహదూర్
ముత్తుల తాత ఈర్య నాయక్
పెట్టిన పేరు భీమ్లా నాయక్
శభాష్ భీమ్లా నాయక.
ఇలా తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్న మొగులయ్య జీవితం.. ఒడిదుడుకుల మయం… బ్రతుకు తెరువు కోసం తాతల తరం నుంచి వస్తున్న 12 మెట్ల కిన్నెర కళను ఎంచుకొని.. ఆ తంత్రులకు తన గాత్రాన్ని జోడించి బతుకుదెరువుగా మార్చుకున్నాడు.. ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఆవుసుల కుంటలో నివాసం ఉంటున్న మొగులయ్య ఎల్లయ్య, రాములమ్మ దంపతులకు జన్మించాడు. ముగ్గురు సంతానంలో మొదటివాడైన మొగులయ్య చిన్నప్పటినుండి 12 మెట్ల కిన్నెర వాయించడం, అందుకు తగ్గట్టుగా పదాలు జోడించి పాటలు పాడడం నేర్చుకున్నాడు.. కుటుంబ పోషణ కోసం కూలి నాలి చేసుకుంటూ.. సంతలు, జాతరలకు వెళ్లి ఉమ్మడి పాలమూరు జిల్లాలో జనపదలు కథలుగా చెప్పుకునే పండుగ సాయన్న, మియాసాబ్ తదితర వీరుల కథలను తన 12 మెట్ల కిన్నెర తంత్రులకు అనుగుణంగా.. పాటలుగా మలచుకుని అందరినీ మంత్రముగ్ధులను చేసి వారు ఇచ్చే కొద్దిపాటి నగదు, సరుకులు, కూరగాయలు తీసుకొని కుటుంబాన్ని పోషించుకునే వాడు.
ఒక్కొక్కసారి బతుకుదెరువుకు ఈ కళ ఉపయోగపడక పడకపోవడంతో దేశంలోని పలు ప్రాంతాలకు వలసలు వెళ్లి కూలి నాలి చేయడంతోపాటు, చిత్తు కాగితాలు, ఇనుప సామాను సేకరించుకొని వాటిని విక్రయించి కుటుంబానికి అండగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే హైదరాబాదులో తిరుగుతూ, తీరిక సమయాల్లో చెట్ల కింద కూర్చొని తన కళను ప్రదర్శిస్తూ వచ్చారు. అతనిలో ఉన్న అద్భుత కళను గుర్తించిన కొంతమంది మీడియా ప్రతినిధులు వెలుగులోకి తీసుకురావడం, ఆ వెంటనే పలు ప్రదర్శనలను ఇప్పించడం జరిగింది. అందరూ శభాష్ అన్నారు. అంతో ఇంతో ఆర్థిక సహాయం చేశారు. కానీ పూర్తిస్థాయి సమస్యలు తీరలేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మొగిలయ్య కళ్ళను గుర్తించింది. రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నెలకు పదివేల రూపాయల పింఛన్ వచ్చేలా చేశారు. త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తానని మంత్రి ఆ మధ్య హామీ ఇచ్చారు.
కళను గుర్తించిన పవన్ కళ్యాణ్..
ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాలో వెరైటీ గాత్రాన్ని పరిచయం చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లా జానపద కళాకారుల నోళ్లల్లో నానుతున్న వీరులు పానగల్ మియా సాబ్, పండుగ సాయన్న పాటలను తన 12 మెట్ల కిన్నెర వాయిస్తూ పాడారు. ఈ పాటలు విని పవన్ కళ్యాణ్ తన భీమ్లా నాయక్ చిత్రంలో ఇంట్రడక్షన్ సాంగ్ కోసం మొగులయ్యని ఎంపిక చేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మొగులయ్య ఆ పాట అను పల్లవిని, హీరో ఇంట్రడక్షన్ పాటగా ఆలపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఇంతకన్నా సంతోషం ఏముంటది..
నా జీవితం మొత్తం ఈ 12 మెట్ల కిన్నెరను నమ్ముకుని సాగుతుంది. కుటుంబ పోషణ భారమైనా.. కష్టాలు ఎన్ని ఎదురొచ్చిన కళ్ళను మరువలేదు.. మన ప్రభుత్వం నాకు మంచి గుర్తింపునిచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ పాట పాడే అవకాశం ఇచ్చారు. ఆయన స్వయంగా నాతో ఫోన్లో మాట్లాడి పిలిపించుకుని, మద్రాసుకు పంపించి పాట పాడిచ్చిండు. నాకు అన్ని విధాలా గుర్తింపు రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు, మామిడి హరికృష్ణ సార్‌కు నమస్కారాలు.