మొబైల్ డాక్టర్.. 12ఏళ్లుగా కారులోనే క్లినిక్
దిశ, ఫీచర్స్ : మానసికంగా బలమైన వ్యక్తులు తమ వ్యక్తిగత సమస్యలతో పోరాడుతున్నప్పటికీ, ఇతరులకు సహాయం చేయడానికి వెనకాడరని చెప్పడానికి డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బినే నిదర్శనం. మనం ప్రతి ఒక్కరికీ సాయం చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ మరోకరికి సహకారం చేయవచ్చని సునీల్ నమ్ముతాడు. కొన్నేళ్ల క్రితం హోసూర్ రోడ్డులో తనకు జరిగిన ఓ యాక్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది. వాహనాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదా వైద్య పరికరాలను తప్పనిసరిగా ఉంచాలని అతను గ్రహించిన […]
దిశ, ఫీచర్స్ : మానసికంగా బలమైన వ్యక్తులు తమ వ్యక్తిగత సమస్యలతో పోరాడుతున్నప్పటికీ, ఇతరులకు సహాయం చేయడానికి వెనకాడరని చెప్పడానికి డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బినే నిదర్శనం. మనం ప్రతి ఒక్కరికీ సాయం చేయలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ మరోకరికి సహకారం చేయవచ్చని సునీల్ నమ్ముతాడు. కొన్నేళ్ల క్రితం హోసూర్ రోడ్డులో తనకు జరిగిన ఓ యాక్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది. వాహనాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదా వైద్య పరికరాలను తప్పనిసరిగా ఉంచాలని అతను గ్రహించిన రోజది. ఆనాటి నుంచి తన కారునే ‘క్లినిక్’లా తీర్చిదిద్ది రోగి ఇంటి వద్దనే ఉచిత వైద్య చికిత్స, ప్రైమరీ కేర్ సర్వీస్ అందిస్తూ.. గత 12 ఏళ్లుగా తన సేవాగుణాన్ని చాటుతున్నాడు. పాండమిక్ సమయాల్లోనూ కొవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తూ, మిగతా వేళల్లో ఇతర రోగులకు సహాయం చేయడానికి బెంగళూరు అంతటా తిరుగుతున్నాడు.
ఉదయాన్నే సునీల్ కుమార్ తన ‘మొబైల్ కారు క్లినిక్’లో బెంగళూరు వాసులకు చికిత్స అందించడానికి ఇంటింటికి వెళతాడు. అవసరమైన టెస్ట్‌లు చేసి, మందులు ఇస్తాడు. గత దశాబ్ద కాలంగా సునీల్ దినచర్య ఇదే. మల్లేశ్వరం నివాసి అయిన 37 ఏళ్ల డాక్టర్ సునీల్ పేదలకు ఉచితంగా చికిత్స చేయడానికి తన మాతృ సిరి ఫౌండేషన్ ద్వారా మొబైల్ క్లినిక్ నడుపుతున్నాడు. ప్రఖ్యాత బెంగళూరు కార్పొరేట్ ఆసుపత్రిలో తన వృత్తిని ప్రారంభించిన ఈ డాక్టర్.. సమాజానికి సేవ చేయడంలోనే జీవితముందని గ్రహించి తన వైద్యవృత్తికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలోనే 2008లో మొబైల్ క్లినిక్ ప్రారంభించి, ఇప్పటికీ లక్షమందికి పైగా రోగులకు తన సేవలందించాడు. తన కారులోనే రోగులకు అవసరమైన మందులు, గ్లూకోమీటర్, ఆక్సిజన్ ట్యాంక్, బిపి మానిటర్, ఇసిజి మెషీన్లను ఉంటాయి. రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో, కాంట్రాక్టు ప్రాతిపదికన బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కొవిడ్ క్లినిక్‌లో నైట్‌షిఫ్ట్‌లో పనిచేస్తున్నాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని ఆసుపత్రులకు వెళ్ళలేని రోగులకు, సీనియర్ సిటిజన్లు, తేలికపాటి కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి చికిత్స చేయడానికి మళ్లీ తన మొబైల్ కారులో బయలుదేరుతాడు. ఇలా డబుల్ డ్యూటీ చేస్తూ రోజుకు దాదాపు 20 గంటలు రోగుల సేవలోనే నిమగ్నమయ్యాడు సునీల్.
తొలి అడుగు
విజయపుర జిల్లాలోని నామడపుర అనే చిన్న కుగ్రామానికి చెందిన సునీల్ 2007లో బీజాపూర్ మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు. తన గ్రామానికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉండటంతో వైద్యకోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో వెహికల్స్ కూడా అందుబాటులో ఉండవు. అలాంటి పరిస్థితులే సునీల్ మొబైల్ క్లినిక్ ప్రారంభించేందుకు కారణమయ్యాయి. ప్రస్తుతం రోజుకు 10-12 మంది రోగుల ఇంటివద్దకు వెళ్లి చికిత్స అందిస్తున్నాడు. పెరిగిన పెట్రోల్ ధరలు, మందులు, లాజిస్టిక్స్ ఇతరత్రా ఖర్చుల నిమిత్తం అతడు విరాళాలు సేకరిస్తున్నాడు.
పైలట్ ప్రాజెక్ట్
విజయపురలోని మురంకేరి బాగల్‌కోట్ రోడ్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటీవలే ఓ క్లినిక్ ప్రారంభించాడు. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య సేవలన్నీ ఉచితంగా అందిస్తారు. ఇందులో డాక్టర్, నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, రిసెప్షనిస్ట్ అందుబాటులో ఉంటారు. అల్లోపతి, ఆయుర్వేదం, యోగా సేవలు, మందులు, ల్యాబ్ టెస్ట్‌లను ఉచితంగా అందిస్తున్నారు. ల్యాబ్ పరీక్షల కోసం ఒక ప్రైవేట్ ల్యాబ్‌తో వీళ్లు టై-అప్ అయ్యారు. ఈ క్రమంలోనే సమీప భవిష్యత్తులో 100 పడకల ఆసుపత్రితో పాటు, పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
‘నేను ప్రమాదానికి గురైన నాటి నుంచి నాలో మార్పు మొదలైంది. రోడ్డు ప్రమాదాల సమయంలో వైద్యమందించడానికి హుటాహుటిన హాజరు కావాల్సిన అవసరం ఉందని గ్రహించాను. ఓసారి సకాలంలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాను. తన కొడుకు ప్రాణాలను కాపాడినందుకు బాధితుడి తల్లి తన కృతజ్ఞతను నవ్వు రూపంలో చెప్పింది. ఆమె ముఖంలో కనిపించిన చిరునవ్వు ఎంతో అమూల్యమైనది. అంతకుమించిన సంతృప్తి ఏం ఉంటుంది. ఇలా ప్రజలకు అవసరమైన రీతిలో సహాయం చేయగలిగితే చాలా మంది ప్రాణాలను కాపాడవచ్చు. హెల్త్‌కేర్ ఒక ప్రాథమిక మానవ హక్కు అని నేను నమ్ముతున్నాను. కానీ మన దేశంలో ఇది నిజంగా అమలవుతుందా? అంటే చెప్పలేని పరిస్థితి. జాతీయ ఆరోగ్య విధానం 2015 ప్రకారం, ప్రతి సంవత్సరం 63 మిలియన్ల మంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఇండియాలో ఏటా రెండు మిలియన్ల మురికివాడల్లో పిల్లలు చనిపోతున్నారు. మనకు ప్రపంచంలోనే అత్యధిక డిసీజ్ ఇండెక్సెస్ (వ్యాధి సూచికలు) ఉన్నాయి. ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు మనం దేశంగా ఎంత అభివృద్ధి చెందితే ఏం లాభం? అందుకే పేదరికం కారణంగా ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేని నిరుపేద, అణగారిన ప్రజలకు సేవ చేస్తున్నాను. పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలన్నదే నా సంకల్పం. ఇప్పటివరకు 750+ ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ చెక్అప్ క్యాంపులను నిర్వహించాను.
– డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బి, మొబైల్ డాక్టర్