అరచేతిలో.. గోరింట అందాలు
దిశ, వెబ్‌డెస్క్ : అతివల చేతులు.. ఎరుపు అందాలతో మురిసిపోతున్నాయి. గోరింట మెరుపులతో ఆకట్టుకుంటున్నాయి. తొలకరిలో విరగ పూసిన గోరింటాకు.. అరచేతుల్లో సిగ్గు మొగ్గలేస్తోంది. చిరునవ్వుల వెన్నెల కురిపిస్తోంది. చిన్నారుల నుంచి ఆరు పదుల బామ్మ వరకు ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. టాటూల కాలంలోనూ.. మనింటి మహారాణులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎరుపెక్కిన ఆ పూల వనంలోకి.. మనమూ వెళ్లొద్దాం రండి.. వేడుకలైనా.. శుభకార్యాలైనా.. ఆడపిల్లల అరచేతిలో అరుణ వర్ణపు ముగ్గులు కొలువు తీరాల్సిందే. […]
దిశ, వెబ్‌డెస్క్ : అతివల చేతులు.. ఎరుపు అందాలతో మురిసిపోతున్నాయి. గోరింట మెరుపులతో ఆకట్టుకుంటున్నాయి. తొలకరిలో విరగ పూసిన గోరింటాకు.. అరచేతుల్లో సిగ్గు మొగ్గలేస్తోంది. చిరునవ్వుల వెన్నెల కురిపిస్తోంది. చిన్నారుల నుంచి ఆరు పదుల బామ్మ వరకు ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. టాటూల కాలంలోనూ.. మనింటి మహారాణులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎరుపెక్కిన ఆ పూల వనంలోకి.. మనమూ వెళ్లొద్దాం రండి..
వేడుకలైనా.. శుభకార్యాలైనా.. ఆడపిల్లల అరచేతిలో అరుణ వర్ణపు ముగ్గులు కొలువు తీరాల్సిందే. ఓ చేతిలో.. భానుడు అలా అస్తమిస్తుంటే.. మరో చేతిలో చంద్రుడు చుక్కలను తోసుకుంటూ తొంగి చూస్తాడు. ఆ కరతామరాల్లో ఎన్నెన్ని పూల వనాలు విచ్చుకుంటాయో.. ఎన్నెన్ని ఆకృతులు ప్రాణం పోసుకుంటాయో.. చెప్పడం మన తరమా! ఊహించడం సాధ్యమా? కాదు కదూ! ఆ ఎరుపెక్కిన అందాలను పక్కన పెడితే.. ఆషాడంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడానికి మొదటి కారణమేంటంటే.. ఈ కాలంలోనే ఆకు విరగ కాస్తుంది. దాంతో పాటు గ్రీష్మంలో మన శరీరం వేడెక్కుతుంది. ఆషాడం రాకతో.. వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఆ వాతావరణానికి తగ్గట్లు శరీరాన్ని చల్ల బరిచేందుకు అందరూ గోరింటాకు పెట్టుకునేవారు. అనాదిగా అలా పెట్టుకుంటూ వస్తున్నారు. అదే నేడు ఓ సంప్రదాయంగా మారింది. ఇప్పుడు పల్లెల నుంచి పట్టణాల వరకు అతివలంతా కలిసి.. సామూహిక గోరింటాకు పండుగలు జరుపుతున్నారు. గోరింటాకును చేతులతో పాటు కాళ్లకు కూడా పారాణిగా రాస్తుంటారు. మతాలకు అతీతంగా.. హిందువులే కాదు ముస్లిం యువతులు కూడా గోరింటాకును ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు.
ఔషధ గోరింట..
గోరింటను దివ్య ఔషధoగా భావించి.. ప్రాచీన యుగాల నుంచి మానవులు పలు రకాలుగా దీన్ని వాడుతున్నారు. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీనిలో యాంటీ బయాటిక్ లక్షణాలు ఉండటం వల్ల క్రిములను దరి చేరనీయదు. శరీరంలోని వేడిని తీసేసే లక్షణం గోరింటాకులో ఉంది. అల్లోపతిలో కూడా దీన్ని వినియోగిస్తున్నారు. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని వైద్యులు చెబుతారు. కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ గోరింటాకు ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో నిరూపితమయ్యింది. గోరింట పూత, చెట్టు బెరడు, వేళ్ళను చిట్కా వైద్యంలో ఉపయోగించే వారు. ఆధ్యాత్మిక పరంగాను గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీకగా చెబుతారు.
ఫ్యాషన్ ప్రపంచంలో..
గోరింటాకు పెట్టడం ఒక కళ. అందరికీ ఆ విద్య రాదు. అందుకే .. ప్రస్తుతం “మెహెందీ ఆర్ట్” ఒక వ్యాపార అవకాశంగా మారింది. కానీ ఇది మన గోరింటాకు కాదు. కెమికల్ పౌడర్స్ ఉపయోగించి తయారు చేసే మెహెందీ కోన్‌లనే వీటికి ఉపయోగిస్తారు. అద్భుతమైన, సృజనాత్మకమైన డిజైన్లు పెట్టే వారికి పెళ్లిళ్ల సీజన్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. మెహెందీ పెట్టినందుకు గాను పదిహేను వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తారు.