డబుల్ బెడ్‌రూం ఇండ్లపై తీవ్ర అసంతృప్తి.. మరీ ఇంత దారుణమా..?
దిశ, కామారెడ్డి: ‘నిరుపేదలకు ప్రభుత్వమే పక్కా ఇళ్ళు కట్టిస్తుంది. మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా ఇళ్ల నిర్మాణం ఉంటుంది. గతంలో మాదిరిగా కాకుండా డబుల్ బెడ్ రూం, హాల్, కిచెన్ వసతితో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం’ ఇది సీఎం కేసీఆర్ చెప్తున్న మాట. కానీ నిర్మించిన ఇళ్లకు వసతులు లేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అసలు ఇలాంటి ఇండ్లు, ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటే అంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొదటిసారిగా ఆరు నెలల క్రితం పంపిణీ చేసిన డబుల్ ఇళ్ళ […]
దిశ, కామారెడ్డి: ‘నిరుపేదలకు ప్రభుత్వమే పక్కా ఇళ్ళు కట్టిస్తుంది. మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా ఇళ్ల నిర్మాణం ఉంటుంది. గతంలో మాదిరిగా కాకుండా డబుల్ బెడ్ రూం, హాల్, కిచెన్ వసతితో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం’ ఇది సీఎం కేసీఆర్ చెప్తున్న మాట. కానీ నిర్మించిన ఇళ్లకు వసతులు లేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అసలు ఇలాంటి ఇండ్లు, ఇచ్చినా ఇవ్వకున్నా ఒకటే అంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మొదటిసారిగా ఆరు నెలల క్రితం పంపిణీ చేసిన డబుల్ ఇళ్ళ స్థితిగతులపై దిశ ప్రత్యేక కథనం.
రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైనట్టుగానే కామారెడ్డి నియోజకవర్గానికి కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయి. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదల కోసం ప్రభుత్వం 2,600 ఇళ్లను మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని నాలుగైదేళ్ల కిందటే అన్ని చోట్ల స్థలాల ఎంపిక చేసి శంకుస్థాపనలు కూడా చేశారు. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి ఇళ్ల నిర్మాణం ముందుకు సాగలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎలాగైనా ఇళ్ల నిర్మాణము పూర్తి చేయాలన్న సంకల్పంతో కాంట్రాక్టర్లను మార్చి దాదాపు 1800 ఇళ్లను పూర్తి చేశారు. అయితే అందులో మొదటగా లింగాయిపల్లి శివారులో కట్టిన 40 ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
8 నెలల క్రితం..
కామారెడ్డి మండలం లింగాయిపల్లి గ్రామ శివారులో 2.52 కోట్ల వ్యయంతో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గత సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున రాష్ట్ర గృహానిర్మాణాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అదే రోజు అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించి పాలు పొంగించారు. ఇల్లు ప్రారంభించి 8 నెలలు గడిచింది. 8 నెలలుగా అక్కడ నివాసం ఉంటున్న లబ్ధిదారులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
పైప్ లైన్ లీకేజీలు..
జి ప్లస్ 1 విధానంలో నలభై ఇళ్లను నిర్మించగా అందులో పైన ఒక కుటుంబం కింద ఒక కుటుంబం మొత్తం నలభై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే రెండు ఇళ్లకు కలిపి ఒకే పైప్ లైన్‌తో లింక్ కలిపారు. పైప్ లైన్ సరిగ్గా లేక అందులోంచి నీరు లీకేజీ అవుతోంది. ఇళ్లలోకి వచ్చినప్పటి నుంచి పైప్ లైన్ లీకేజీ సమస్య కొనసాగుతూనే ఉంది
ప్రతి ఇంటికి తడి..
పైప్ లైన్ లీకేజీతో ప్రతి ఇంటికి తడి వస్తోంది. ఇంట్లో ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంటోంది. కరెంట్ బోర్డులు, గోడలపై తడి వస్తుండటంతో కరెంట్ వేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ తడి మరింత ఎక్కువైంది. పై నుంచి నీరు చుక్కలు చుక్కలుగా రావడం మొదలైంది. పైప్ లైన్ నుంచి నీరంతా గోడలకు పట్టుకుంటోంది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు
మరుగున పడిన మరుగుదొడ్ల పైప్ లైన్..
ఇదిలా ఉంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి వసతి కల్పించారు. మరుగుదొడ్డి నుంచి మలమూత్ర విసర్జనలు బయటకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన పైప్ లైన్ మూసిపోయింది. ఎక్కడికక్కడ పైప్ లైన్ జామ్ కావడంతో మలం మొత్తం అందులోనే ఉండిపోయి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లలేక బహిరంగ విసర్జనలకు వెళ్తున్నారు. పక్కన వ్యవసాయ భూముల్లోకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తే సంబంధిత వ్యవసాయ భూముల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇంట్లో బాత్ రూమ్ వెళ్లలేక, అటు బయటకు వెళ్లే పరిస్థితి లేక నరకయాతన అనుభవిస్తున్నారు లబ్ధిదారులు.
వీధి లైట్లు లేక అంధకారం..
అన్నిటికన్నా ముఖ్యంగా రాత్రి అయితే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కాలనీలో ఏర్పాటు చేసిన వీధి లైట్లు ఇళ్ల ప్రారంభం చేసిన తర్వాత కేవలం వారం రోజులు మాత్రమే వెలిగాయని స్థానికులు వాపోతున్నారు. 8 నెలలుగా వీధి లైట్లు లేక అంధకారం నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మరుగుదొడ్డి వసతి సరిగ్గా లేక రాత్రిపూట బయటకు వెల్దామంటే పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొందరు ప్రతి రోజు మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు వాపోతున్నారు. ఇక్కడ తాగవద్దని చెప్తే మీరెవరు చెప్పడానికి అంటూ బెదిరిస్తున్నారని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధులకు తప్పని తిప్పలు..
అక్కడ ఉంటున్న వారిలో ఉన్న వృద్ధుల పరిస్థితి మాత్రం ఆగమ్యగోచరంగా తయారైంది. అసలే వయసు పైబడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులకు కిందకు పైకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ఒకవేళ కిందకు వచ్చినా కరెంట్ లేక ఎక్కడ పడిపోతామో అని భయపడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాములు, పురుగులు ఎక్కడ ఉన్నాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని చెబుతున్నారు
ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్..
కాలనీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకపోవడంతో చిన్నపిల్లలను బయటకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు.
సమస్యలు పరిష్కరించండి..
ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఒక్క సమస్య ఉందని చెప్పలేం. 8 నెలలుగా నరకం అనుభవిస్తున్నం. మా బాధలు పట్టించుకునేవాళ్ళు లేరు. కాలకృత్యాలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. మగవాళ్ళు, మేము ఒకేసారి బయటకు వెళ్లాల్సి వస్తోంది. మా సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది. -లింగవ్వ, లబ్దిదారురాలు
ఇండ్లు ఇచ్చినా లాభం లేదు..
ఇక్కడికి ఎందుకు వచ్చామా అనిపిస్తోంది. ఈ ఇండ్లు మాకు ఇవ్వకున్నా ఏమి కాకపోతుండే. ఇల్లు ఇచ్చినా లాభం లేదు. కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఇల్లు లేనప్పుడు తాటిపత్రి కట్టుకుని ఉన్నా మాకు ఇన్ని బాధలు లేవు. మమ్మల్ని పట్టించుకోండి సారు. -బాలరాజు, లబ్ధిదారుడు
పాములు వస్తాయని భయంగా ఉంది..
నాలుగు రోజుల నుంచి వర్షం పడుతోంది. నా కాలు విరిగి నడవలేని పరిస్థితి. రాత్రిపూట బయటకు వద్దామంటే భయమేస్తోంది. ఎక్కడ ఏ పాము ఉందొ. ఎక్కడ ఏ పురుగు ఉందొ తెలుస్తలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం. -ఎల్లవ్వ లబ్ధిదారురాలు