ట్రంపు కారు.. కదిలే యుద్ధట్యాంక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశీ, విదేశీ పర్యటనల కోసం వినియోగించే కారు పేరు ‘బీస్ట్’. ఒక రకంగా చెప్పాలంటే ఇది కదిలే యుద్ధట్యాంకు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణ, అత్యాధునిక కమ్యూనికేషన్ సామర్థ్యం, ఆయుధాలు, మందుపాతరలు పేలినా తట్టుకునేశక్తి, ఆయుధాలను ప్రయోగించ గల సామర్థ్యం దీని సొంతం. భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి బీస్ట్‌నే ఉపయోగించనున్నారు. ఈ క్రమంలో ఆ కారు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.. 1910లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడి […]

Update: 2020-02-20 06:25 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశీ, విదేశీ పర్యటనల కోసం వినియోగించే కారు పేరు ‘బీస్ట్’. ఒక రకంగా చెప్పాలంటే ఇది కదిలే యుద్ధట్యాంకు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణ, అత్యాధునిక కమ్యూనికేషన్ సామర్థ్యం, ఆయుధాలు, మందుపాతరలు పేలినా తట్టుకునేశక్తి, ఆయుధాలను ప్రయోగించ గల సామర్థ్యం దీని సొంతం. భారత పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి బీస్ట్‌నే ఉపయోగించనున్నారు. ఈ క్రమంలో ఆ కారు ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం..

1910లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడి కోసం ప్రత్యేక కారును తయారు చేశారు. రెండు దశాబ్దాల తర్వాత అప్పటి అధ్యక్షుడు హెర్బర్ట్ హోవర్ కోసం కాడిలాక్ లిమోజీన్ (సాయుధ వాహనం)ను అందుబాటులోకి తీసుకువచ్చారు. తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భద్రత కోసం కాడిలాక్ ఒన్ లిమోజీన్‌ను వినియోగించారు. ఈ కారును డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత 2018, సెప్టెంబర్ 24న మార్చారు. అత్యాధునిక వసతులు కలిగిన ఈ ఆర్మర్డ్ లిమోజీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

దేశాధ్యక్షుడి కారును అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ తయారు చేస్తుంది. ఈ కారు పొడవు 18 అడుగులు, బరువు 8 టన్నులు. గరిష్ఠ వేగం గంటకు 60 మైళ్లు. దీని కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేశారు. ముందు వరసలో ఇద్దరు, మధ్య వరసలో ముగ్గురు, వెనుక వరసలో ఇద్దరు కూర్చోవచ్చు. డ్రైవర్ క్యాబిన్‌ కమ్యూనికేషన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇందులో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, చిన్నపాటి సెల్‌టవర్ ఉంటుంది. ఈ కారుకు అన్ని వైపులా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉంటాయి. వీటిని పాలికార్బొనేట్‌తో తయారు చేస్తారు. వీటిని అధ్యక్షుడు మాత్రమే కిందికి దించగలడు. డ్రైవర్ వైపు ఉన్న అద్దం కేవలం మూడు అంగుళాలు మాత్రమే కిందికి దిగుతుంది.

కారు బాడీ మొత్తం ఎనిమిది అంగుళాల మందం ఉన్న మిలిటరీ గ్రేడ్ స్టీల్‌షీట్‌తో తయారు చేశారు. ఇందుకోసం స్టీల్, టైటానియం, అల్యూమినియం, సిరామిక్స్‌ను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి బుల్లెట్ అయినా బీస్ట్‌ కారును చీల్చలేవు. కారు ముందు భాగంలో భాష్పవాయు గోళాలు ప్రయోగించే వ్యవస్థ, నైట్ విజన్ కెమెరాలు ఉంటాయి. అధ్యక్షుడి భద్రతకు ఏదైనా ముప్పు అని భావిస్తే వెంటనే భాష్పవాయుగోళాలను ప్రయోగించవచ్చు. రాత్రుల్లో కూడా రోడ్డును బాగా చూసేందుకు నైట్ విజన్ కెమెరాలు ఉపయోగపడతాయి. మందుపాతర్లు, బాంబులు కూడా ఇంధన ట్యాంకును ఏమి చేయలేవు. దీన్ని పేలుడు నిరోధక ప్రమాణాలతో తయారు చేశారు. టైర్లు పేలినా ఇబ్బంది ఏమీ ఉండదు. కారు యథావిధిగా ముందుకు సాగుతుంది. ఇందుకు వీలుగా కేవ్లర్ కోర్ టైర్లను ఏర్పాటు చేశారు. కారు లోపల షాట్‌గన్, కారు వెనుక బంపర్‌లో టియర్‌గ్యాస్ క్యానన్లు ఉంటాయి.

కారు మధ్యలో అధ్యక్షుడు కూర్చునే చోట శాటిలైట్ ఫోన్ ఉంటుంది. ఇది నేరుగా అమెరికా ఉపాధ్యక్షుడు, పెంటాగన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఏదైనా అత్యవసరమైతే ఫోన్ లిఫ్ట్ చేస్తే చాలు పెంటాగన్‌కు కనెక్ట్ అవుతుంది. అదే సీటులో అత్యవసర బటన్ ఉంటుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆటోమెటిక్‌గా ఆక్సిజన్ సరఫరా అవుతుంది. అధ్యక్షుడి రక్త గ్రూప్‌నకు సంబంధించిన బ్లడ్ బాటిల్స్ కూడా ఉంటాయి. కారు డోర్లు ఎనిమిది అంగుళాల మందం కలిగి ఉంటాయి. ఎలాంటి పేలుడు పదార్థాల ధాటినైన తట్టుకొనే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఈ కారు డోర్ బరువు బోయింగ్ 757 విమానం డోరంత ఉంటుంది. దీన్ని లోపలి నుంచి తీయడానికి వీలు కాదు. బయట నుంచే తీయాల్సిందే. ఒక్కసారి ఈ తలుపులను మూసివేస్తే కారు 100 శాతం మూసుకుపోతుంది. జీవ రసాయన ఆయుధాల నుంచి రక్షణ కోసం ఇలాంటి ఏర్పాటు చేశారు.

అధ్యక్షుడి భద్రతా ఏర్పాట్లను మొత్తం అమెరికా సీక్రెట్ సర్వీస్ పర్యవేక్షిస్తుంటుంది. ఈ సంస్థనే బీస్ట్ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. ఈ వాహన డ్రైవర్ ఎంపిక చాలా కఠినంగా ఉంటుంది. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా డ్రైవర్‌కు అమెరికా సీక్రెట్ సర్వీసు శిక్షణ ఇస్తుంది. అవసరమైతే 180 డిగ్రీలో అంటే ఆంగ్ల జే ఆకారంలో కారును మలుపు తిప్పగలుగుతాడు. ఒకే రకమైన 12 కార్లు అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌లో వరుసగా ప్రయాణిస్తాయి. అధ్యక్షుడు ఏ కారులో ఉన్నదీ పసిగట్టడం అసాధ్యం.

Tags:    

Similar News