బతుకమ్మ వేడుకలతో పాలమూరు పూలవనమాయే
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు.. పూలవనం అయింది.. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి.. రంగురంగుల పూలతో తయారుచేసిన బతుకమ్మలు.. బాణాసంచా వెలుగులు.. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారుల సాంప్రదాయ నృత్యాలతో పాలమూరు పూల వనంగా మారింది. బతుకమ్మ సంబురాల్లో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన మెగా బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమానికి పాలమూరు మహిళలతో పాటు, వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది మహిళలు […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు.. పూలవనం అయింది.. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి.. రంగురంగుల పూలతో తయారుచేసిన బతుకమ్మలు.. బాణాసంచా వెలుగులు.. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారుల సాంప్రదాయ నృత్యాలతో పాలమూరు పూల వనంగా మారింది. బతుకమ్మ సంబురాల్లో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై నిర్వహించిన మెగా బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమానికి పాలమూరు మహిళలతో పాటు, వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది మహిళలు అందమైన బతకమ్మలను తయారుచేసుకుని మినీ ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు, మహిళల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ మైదానం వద్ద ఉన్న ఎల్లమ్మ దేవి ఆలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూజలు నిర్వహించి వేడుకలకు శ్రీకారం చుట్టారు. కళాకారులు, అధికారులు, బతుకమ్మలతో వచ్చిన పలువురు మహిళలతో కలిసి.. డప్పుల మోతల నడుమ కళాకారుల నృత్యాలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు మినీ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బతుకమ్మలకు మంత్రి, కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.
మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్ షో సైతం ఈ కార్యక్రమానికి హాజరైన జనానికి ఉత్సాహాన్నిచ్చింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో మినీ ట్యాంక్ బండ్‌లో ఏర్పాటుచేసిన బాణాసంచా వెలుగులు ఆకాశాన్ని తాకుతూ అందరినీ ఆనందాలలో ముంచెత్తాయి. మరోవైపు మినీ ట్యాంక్ బండ్ చెరువు లో ఏర్పాటుచేసిన హంస వాహనం వెలుగులు కలకలలాడుతూ అందరినీ ఆకట్టుకుంది.. పొద్దు పోయే వరకు సాగిన ఈ వేడుకలను వేలాది మంది జనం ఆసక్తిగా తిలకించారు.. అనంతరం బతకమ్మలను చెరువులో నిమజ్జనం చేశారు.