కాళ్లతోనే డ్రైవింగ్.. ఏకైక స్పోర్ట్స్ డ్రైవర్ గా రికార్డ్.. సత్తాచాటుతున్న ఆ యువకుడు

దిశ, ఫీచర్స్ : ఒక విషాద ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినప్పటికీ, ప్రొఫెషనల్ కార్ డ్రిఫ్టింగ్ పోటీల్లో సమర్థులైన డ్రైవర్లతో పోటీపడుతూ సత్తా చాటుతున్నాడు ఓ యంగ్ మోటార్ స్పోర్ట్స్ ఔత్సాహికుడు. అంతర్జాతీయ ఎఫ్‌ఐఏ(FIA) రేసింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అతడు,పోలిష్ , యూరోపియన్ లీగ్స్‌లోని ఇతర డ్రైవర్లతో సమానంగా పోటీల్లో పాల్గొన్నాడు. 2019 లో పోలిష్ డ్రిఫ్టింగ్ DMP సాధారణ వర్గీకరణలో మూడో స్థానంలో నిలిచి ఔరా అనిపించాడు. వెక్కిరించిన విధిని ధిక్కరించి ముందుకు సాగుతున్న […]

Update: 2021-10-17 05:16 GMT

దిశ, ఫీచర్స్ : ఒక విషాద ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినప్పటికీ, ప్రొఫెషనల్ కార్ డ్రిఫ్టింగ్ పోటీల్లో సమర్థులైన డ్రైవర్లతో పోటీపడుతూ సత్తా చాటుతున్నాడు ఓ యంగ్ మోటార్ స్పోర్ట్స్ ఔత్సాహికుడు. అంతర్జాతీయ ఎఫ్‌ఐఏ(FIA) రేసింగ్ లైసెన్స్ కలిగి ఉన్న అతడు,పోలిష్ , యూరోపియన్ లీగ్స్‌లోని ఇతర డ్రైవర్లతో సమానంగా పోటీల్లో పాల్గొన్నాడు. 2019 లో పోలిష్ డ్రిఫ్టింగ్ DMP సాధారణ వర్గీకరణలో మూడో స్థానంలో నిలిచి ఔరా అనిపించాడు. వెక్కిరించిన విధిని ధిక్కరించి ముందుకు సాగుతున్న ఆ యువకుడే ‘బార్టెక్ ఒస్టలోవ్‌స్కీ’. ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులకు స్ఫూర్తిగా నిలుస్తూ అధిగమించలేని సవాళ్లనైనా సాధించవచ్చనేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాడు.

2006లో మోటార్‌సైకిల్ ప్రమాదంలో బార్టెక్ ఒస్టలోవ్‌స్కీ తన రెండు చేతులు కోల్పోయాడు. ఈ దుర్ఘటన అతడిని కొన్ని నెలల పాటు మంచానికే పరిమితం చేసినా అతడి ఆశయాన్ని ఏమాత్రం మార్చలేకపోయింది. ప్రొఫెషనల్ రేస్‌కార్ డ్రైవర్ కావాలనే ఆశయంతో 20 ఏళ్ల వయస్సులో రేస్ సర్క్యూట్‌లో కాళ్లతోనే కారు నడపడం నేర్చుకున్నాడు. మూడేళ్లలో రేస్‌కార్‌ను పాదాలతో నడపడంలో మాస్టర్‌గా ఎదిగాడు. ఇందుకోసం నిస్సాన్ స్కైలైన్ GT-R రేస్‌కార్‌ ఇంజన్‌లో మార్పులతో పాటు ఇండిపెండెంట్ గేర్‌బాక్స్, బ్రేక్స్‌ అనువుగా మార్చుకున్నాడు. బ్రేక్స్ వేసేందుకు కుడి పాదాన్ని ఉపయోగిస్తే, ఎడమ కాలుతో స్టీరింగ్ చేస్తాడు. ఈ విధంగా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో వరల్డ్‌లోనే చరిత్ర సృష్టించాడు.

కష్టాలకు వెరవకుంటే విజయం మీదే..
పోలాండ్‌లో నాలాగే చేతులు లేని వ్యక్తి గురించి విన్నాను. అయినా తను ఎలాంటి సమస్య లేకుండా కారు నడుపుతాడని తెలుసుకుని వెళ్లి కలిశాను. ఆ తర్వాతే మోటార్‌స్పోర్ట్‌లో పార్టిసిపేట్ చేయాలనుకునే నా కలకు రెక్కలొచ్చాయి. అలా మళ్లీ రేసులోకి వచ్చాను. పోలిష్ రేసింగ్ సర్క్యూట్‌లో నాకంటూ పేరు తెచ్చుకున్న తర్వాత డ్రిఫ్ట్ రేసింగ్‌‌‌కు మారాను. ఇది ఎంత కష్టమో మీకు తెలుసే ఉంటుంది. ట్రాక్ చుట్టూ స్కిడ్ చేస్తున్నప్పుడు వేగంగా ప్రతిస్పందించి కారును నియంత్రించాలి. చేతి-కంటి సమన్వయంలో కచ్చితత్వం అవసరం. కాళ్లతో చేయడం కష్టమైన పనే కానీ సాధ్యం చేసి చూపించాను. యూరోప్‌లో అత్యంత పోటీగల చాంపియన్‌షిప్ సిరీస్‌లో ఒకటైన పోలిష్ డ్రిఫ్ట్ పోటీల్లో ఉత్తమ స్థానంలో నిలిచాను. అంతకుముందు ఏడాదిలో ప్రొఫెషనల్ డ్రైవర్లను ఓడించి అంతర్జాతీయ చెక్ డ్రిఫ్ట్ సిరీస్‌ను గెలుచుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది. వాస్తవానికి మోటార్ స్పోర్ట్స్‌లో పాల్గొనడానికి వైకల్యాలున్న ఇతర వ్యక్తులను ప్రోత్సహిస్తాను. అభిరుచి ఉంటే దేనిగురించి ఆలోచించకుండా కలలను సాకారం చేసుకోండి. కష్టాలకు వెరవకుండా ముందడుగు వేస్తే విజయం మీదే అవుతుంది.

– బార్టెక్ ఒస్టలోవ్‌స్కీ

Tags:    

Similar News