మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు.. పట్టించుకునే నాథుడే లేరా..?
దిశ, గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అడిగే వారు లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బెల్టుషాపులను నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి బెల్టుషాపుల నిర్వాహణ నిలువుటద్దంగా నిలుస్తుంది. గండిపేట మండల పరిధిలో అభివృద్ధిలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ, ఇలాంటి అక్రమ మద్యం విక్రయాలతో కార్పొరేషన్‌కు ఉన్న మంచి పేరు కాస్త మసకబారిపోతుంది. ప్రధానంగా కార్పొరేషన్‌లోని గంధంగూడ, బైరాగిగూడ ప్రధాన రహదారిలో […]
దిశ, గండిపేట్ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. అడిగే వారు లేకపోవడంతో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు బెల్టుషాపులను నిర్వహిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి బెల్టుషాపుల నిర్వాహణ నిలువుటద్దంగా నిలుస్తుంది. గండిపేట మండల పరిధిలో అభివృద్ధిలో బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ, ఇలాంటి అక్రమ మద్యం విక్రయాలతో కార్పొరేషన్‌కు ఉన్న మంచి పేరు కాస్త మసకబారిపోతుంది. ప్రధానంగా కార్పొరేషన్‌లోని గంధంగూడ, బైరాగిగూడ ప్రధాన రహదారిలో బెల్టుషాపులను నిర్వహిస్తున్నారు. ఇదేమని అడిగితే బెదిరింపులు, దబాయింపులతో సామాన్యులను అక్కడ నుంచి పంపించివేస్తున్నారు.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా మద్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా షాపులలో నిర్వహిస్తున్నారు. బయటకు కిరాణా షాపుల పేర్లతో చెలామణి అవుతూ అంతర్గతంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. అధికారులు సైతం ఈ అక్రమ క్రయవిక్రయాలను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రధానంగా కార్పొరేషన్‌లో ఇలాంటి చీకటి వ్యాపారాలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనేది బహిరంగ రహస్యం. బయటకు వెళితే తాగుబోతుల వీరంగం ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సైతం ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అయినా తమకేమి పట్టిందిలే అన్న విధంగా ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ దందాలకు చెక్ పెట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఎక్సైజ్ అధికారులకు పట్టదా..?
కార్పొరేషన్‌లో అక్రమంగా మద్యం విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. కిరాణా షాపుల పేరుతో అక్రమ మద్యంను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు ఎందుకని ప్రజలు మండిపడుతున్నారు. ఒక వేళ ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఈ అక్రమ క్రయవిక్రయాలను ప్రోత్సహిస్తున్నారా అనే సందేహాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ఇలాంటి అక్రమ మద్యం విక్రయాలను అడ్డుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు.
ప్రజల అవస్థలు…
అక్రమంగా మద్యం విక్రయాలు సాగుతుండటంతో కార్పొరేషన్‌లో తాగుబోతులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సామాన్య ప్రజల ముందే మద్యాన్ని విక్రయిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగుబోతులు తాగి రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో స్థానికంగా అనేక ప్రమాదాలు, దాడులు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయని స్థానికులు తెలుపుతున్నారు. ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి మద్యం విక్రయాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.