బియ్యం ఇచ్చేది బీజేపీ.. ఫోటో మాత్రం కేసీఆర్‌ది : బండి సంజయ్
దిశ, హుజురాబాద్ రూరల్ : కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. రేషన్ బియ్యానికి కేంద్రం రూ. 29 ఇస్తే.. రాష్ట్రం కేవలం రూపాయి ఇచ్చి దుకాణాల దగ్గర సీఎం ఫొటోలు పెట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచార సభల్లో సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు నిర్వహిస్తున్నారని అన్నారు. […]
దిశ, హుజురాబాద్ రూరల్ : కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. రేషన్ బియ్యానికి కేంద్రం రూ. 29 ఇస్తే.. రాష్ట్రం కేవలం రూపాయి ఇచ్చి దుకాణాల దగ్గర సీఎం ఫొటోలు పెట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచార సభల్లో సంజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు నిర్వహిస్తున్నారని అన్నారు. కానీ, కేంద్రం నిధులు ఇవ్వడంలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వండని ప్రశ్నించినందుకే ఈటల రాజేందర్‌ను బయటకు పంపించారన్నారు. మంత్రి హరీష్.. హుజురాబాద్‌కు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అగ్గి పెట్టె మంత్రి బీజేపీపై ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని బండి హెచ్చరించారు.
గ్రామాల్లో మంత్రి హరీష్ రావుపై ప్రత్యేకమైన యాడ్ తరహాలో టూత్ పేస్టులో ఉప్పుందా.. మంత్రి హరీష్ అగ్గిపెట్టెలో పుల్లలున్నాయా.. అంటూ ప్రశ్నిస్తున్నారని ఎద్దేవ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పేద వర్గాలే బలిదానం చేశాయని గుర్తు చేశారు. కానీ, ఆ త్యాగాల పునాదులపై కేసీఆర్ కుటుంబం రక్త చరిత్ర రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో గెలిచేందుకు ఓట్లను కొనుగోలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ఇచ్చే నోట్లు తీసుకొని బీజేపీకి ఓటు వేయాలని సంజయ్ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం.. ఆస్తులను అమ్ముతున్నదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో కనీసం గుంట భూమి లేకుండా అమ్ముతున్న చరిత్ర టీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం అయ్యే ఖర్చుకు ప్రజలు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో కరోనా చికిత్సను చేర్పించాలని కేంద్రం ఎంత చెప్పినా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
అంతేకాకుండా టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలు పెరిగాయని, రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులతో పాటుగా ఇంటర్ విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ బినామీ సంస్థ నిర్వాకంతో 24 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని బండి విమర్శించారు. దళిత బంధుకు బీజేపీ వ్యతిరేకం కాదని, నిలిపివేయాలని లేఖ రాయలేదని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఫోర్జరీ లేఖలతో గట్టెక్కాలని చూశారని, హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా తన పేరుతో దొంగ లేఖలను క్రియేట్ చేసి బురదజల్లే ప్రయత్నాలు చేశారని విమర్శించారు. భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గర దీనిపై ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ సంజయ్ సవాల్ విసిరారు.