అందరికీ సన్న వడ్లు.. కేసీఆర్‌కు మాత్రం దొడ్డు వడ్లు
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను, అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. రాష్ట్రంలోని రైతాంగానికి సన్న వడ్లు పండించాల్సిందిగా నియంత్రిత సాగు విధానం పేరుతో ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో మాత్రం దొడ్డు వడ్లనే పండిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను నిలువును ముంచేసి తాను మాత్రం సంతోషంగా ఉన్నారని ఆరోపించారు. విజయశాంతి బీజేపీలో చేరిన అనంతరం బండి సంజయ్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను, అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. రాష్ట్రంలోని రైతాంగానికి సన్న వడ్లు పండించాల్సిందిగా నియంత్రిత సాగు విధానం పేరుతో ఆదేశాలు ఇచ్చిన కేసీఆర్ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో మాత్రం దొడ్డు వడ్లనే పండిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను నిలువును ముంచేసి తాను మాత్రం సంతోషంగా ఉన్నారని ఆరోపించారు. విజయశాంతి బీజేపీలో చేరిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ అప్పుడప్పుడూ రోడ్డుమీదకు వస్తూ ఉంటారని, ఇప్పుడు “నేను ఇంకా బతికే ఉన్నాను” అని చెప్పుకోడానికి భారత్ బంద్ గురించి మాట్లాడారని అన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సీఎం కేసీఆర్ కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలకు మద్దతుగా తెలంగాణలోని సుమారు మూడు లక్షల మంది రైతులు స్వయంగా కేసీఆర్‌కే లేఖలు రాశారని, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రైతుల పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్‌కు బీజేపీ త్వరలోనే గుణపాఠం చెబుతుందన్నారు. సన్న వడ్ల విషయంలో బోనస్ ప్రకటించకుండా, వారి బాధలను పట్టించుకోకుండా, పంట నష్టం జరిగినా దాన్ని గాలికి వదిలేసిన కేసీఆర్‌పై బీజేపీ పోరాడుతుందన్నారు. మంగళవారం తెలంగాణలో జరుగుతున్నది టీఆర్ఎస్ బంద్ మాత్రమేనన్నారు.
రాజకీయం కోసమే భారత్ బంద్ : కిషన్ రెడ్డి
రైతులు స్వేచ్ఛగా తమ పంటలను ఎక్కువ ధరకు అమ్ముకునేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చిందని, ఇప్పటివరకూ రైతులకు పంటల అమ్మకంపై ఉన్న ఆంక్షలను తొలగించిందని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి మార్పూ చేయలేదని, వ్యవసాయ చట్టాలను రాజకీయ పార్టీలు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని ఆరోపించారు. భారత్ బంద్ గురించి స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్న కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. సన్న వడ్ల పంట వేయాలని చెప్పిన కేసీఆర్ తీరా పంట చేతికొచ్చిన తర్వాత మాత్రం చేతులెత్తేశారని మండిపడ్డారు.