పార్థసారధి రాజీనామా చేయాలి : బండి సంజయ్

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసీ పోషించిన పాత్ర అప్రజాస్వామికమని, గతంలోని నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ పని చేయకుంటే ప్రభుత్వమే ఆయన్ను బర్తపరఫ్ చేయాలన్నారు. ఈ రెండూ జరగకుంటే అధికార పార్టీని ప్రజలే బర్తరఫ్ చేస్తారన్నారు. […]

Update: 2020-12-04 00:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసీ పోషించిన పాత్ర అప్రజాస్వామికమని, గతంలోని నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైకోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ పని చేయకుంటే ప్రభుత్వమే ఆయన్ను బర్తపరఫ్ చేయాలన్నారు. ఈ రెండూ జరగకుంటే అధికార పార్టీని ప్రజలే బర్తరఫ్ చేస్తారన్నారు. అడ్డదారుల్లో గెలవాలని చూసిన అధికార టీఆర్ఎస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులు ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని పెంచాయన్నారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా, నోటీసులు జారీ చేసినా ముఖ్యమంత్రి తీరులో మార్పు రావడంలేదని, ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హితవు పలికారు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలని చేసిన ప్రయత్నానికి హైకోర్టు అడ్డుకట్ట వేసిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన తొలి నైతిక విజయం ఇది అని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పును గౌరవించలేని కేసీఆర్‌కు సీఎంగా కొనసాగే నైతిక అర్హత లేదన్నారు.

ఆఖరి గంటలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని ఎంపీ సంజయ్ డిమాండ్ చేశారు. కొన్నిచోట్ల 90 శాతానికి పైగా పోలింగ్ ఎలా నమోదైందో వివరాలను బహిర్గతం చేయాలన్నారు. పెన్నుతో టిక్కులు పెట్టినా, ఆ ఓట్లు చెల్లుబాటవుతాయంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యులర్ ద్వారా ఆదేశించడం చూస్తుంటే అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. అధికారం కోసం అడ్డదార్లు తొక్కే టీఆర్ఎస్‌కు ఆకలి, ఆపతి, ఆతృత ఎంతగా ఉన్నాయో ఈ సర్క్యులర్ ద్వారా తెలుస్తోందన్నారు.

Tags:    

Similar News