18 ఏండ్లకు మళ్లీ వచ్చాయి..!

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీలకు దాదాపు రిఫరెండం స్థాయిలో జరుగుతున్నాయి. అయితే, ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య ఉన్న పోటీ ఒక ఎత్తయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విధానం మరో ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే దాదాపు 18 ఏండ్ల తర్వాత ఈ సారి బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం ఇందుకు కారణం. కాలంతోనే ఈవీఎంలు: మారుతున్న కాలం ప్రకారమే ఓటింగ్ విధానంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో […]

Update: 2020-11-30 10:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్, బీజేపీలకు దాదాపు రిఫరెండం స్థాయిలో జరుగుతున్నాయి. అయితే, ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య ఉన్న పోటీ ఒక ఎత్తయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల విధానం మరో ప్రత్యేక ఆకర్షణ. ఎందుకంటే దాదాపు 18 ఏండ్ల తర్వాత ఈ సారి బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించడం ఇందుకు కారణం.

కాలంతోనే ఈవీఎంలు:

మారుతున్న కాలం ప్రకారమే ఓటింగ్ విధానంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌ల ఏర్పాట్లు, తరలింపులో రక్షణ కల్పించడం కోసం వ్యయం, శ్రమ ఎక్కువవుతుందన్న అభిప్రాయాలున్నాయి. దీంతో అధికారులు సమయాన్ని, శ్రమ, డబ్బును ఆదా చేసుకోవడంలో టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో భాగంగానే ఎన్నికల కోసం ఈవీఎంలను తీసుకొచ్చారు. మన దేశంలో ఈవీఎంలను 1994లో ప్రయోగాత్మకంగా మూడు రాష్ట్రాల్లో ఉపయోగించగా.. 2004 లోక్ సభ ఎన్నికల నుంచి ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

బ్యాలెట్‌ పెట్టడానికి రాజకీయ పార్టీలే కారణం:

అయితే, ఈ ఏడాది గ్రేటర్ ఎన్నికలను నిర్వహించే విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని కోరింది. బ్యాలెట్ ఓటింగ్‌ వైపే అధికంగా మెజారిటీ ఉండటంతో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో నుంచి కూడా పలు రాజకీయ పార్టీలు పోలింగ్ సమయాల్లో, ఫలితాలు వెలువడిన తర్వాత ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయ స్వీకరణ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇక ఈ సారి గ్రేటర్‌ ఎన్నికల కోసం 28,683 బ్యాలెట్ బాక్స్‌లను కూడా సిద్ధం చేశారు.

ఇక బల్దియా ఎన్నికల్లో చివరిసారిగా 2002లో బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించగా.. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికలను ఈవీఎం ద్వారానే నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు బ్యాలెట్ బాక్స్‌లను ఉపయోగించడం గమనార్హం. 2002లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (MCH)గా ఉన్నప్పు బ్యాలెట్ బాక్స్‌లను చివరిసారిగా ఉపయోగించారు. ఆ తర్వాత 2007లో పాలకమండలి ముగిసినప్పటికీ.. సరిహద్దు జిల్లాలను కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే

ఇక విలీనం తర్వాత వార్డుల పునర్విభజన, జనాభా గణనా వంటి సహజ ప్రక్రియల నేపథ్యంలో రేండేళ్లు ఆలస్యంగా 2009లో గ్రేటర్ ఎన్నికలను నిర్వహించారు. ఆ గ్యాప్‌లోనే తెలంగాణ ఆవిర్భావం నగరంలో పెను మార్పులకు దారి తీసింది. ఇదే సమయంలో 2014న జీహెచ్ఎంసీ పదవీకాలం ముగిసింది. అయితే, తెలంగాణ విభజన నేపథ్యంలో మళ్లీ రెండేండ్లు ఆలస్యంగా 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించగా.. ఈ రెండు సార్లు ఈవీఎంలనే ఉపయోగించారు. అప్పుడు ఏర్పడిన పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. కొత్త పాలక మండలి కోసం నిర్వహిస్తున్న ఈ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది

సందేహాలున్నా ఈవీఎంలతోనే సులభం:

ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. అయితే, టెక్నాలజీతో ఎన్నికలు నిర్వహించడం సులభంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. కానీ, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు అనుగుణంగానే బ్యాలెట్ ఓటింగ్‌ను ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల పరిషత్ ఎన్నికల కోసం మాత్రమే బ్యాలెట్ బాక్స్‌లనే ఉపయోగిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సందర్భంలో మాత్రం ఈవీఎంలనే ఇప్పటి వరకూ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం మన దేశంలో మొదలు పెట్టి 16 ఏండ్లు పూర్తవ్వగా.. జీహెచ్ఎంసీలో బ్యాలెట్లను ఉపయోగించి 18 ఏండ్లు పూర్తయ్యాయి.

Tags:    

Similar News