కేంద్రం భేష్.. తప్పంతా రాష్ట్రానిదే: బాబు
దిశ, ఏపీ బ్యూరో: కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వ ఎప్పటికప్పుడు లాక్‌డౌన్ విధిస్తూ వచ్చిందని అన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీకి నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం […]
దిశ, ఏపీ బ్యూరో: కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వ ఎప్పటికప్పుడు లాక్‌డౌన్ విధిస్తూ వచ్చిందని అన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీకి నిధులు కేటాయించామని కేంద్ర ఆర్థిక మంత్రే స్వయంగా చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ నిధులను సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారని విమర్శించారు.
ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయిందని అన్నారు. ప్రభుత్వ పెద్దలు కరోనా సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే తమ పైనే విమర్శలు చేసే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. కుటుంబానికి కనీసం రూ.5 వేల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా స్పందన లేదని ఆయన అన్నారు. ప్రజల జీవితాల్లో చాలా సమస్యలు ఉన్నాయన్న ఆయన, కరోనా ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఎలా ఎదుర్కొని ముందుకువెళ్లాలో ఆలోచించాలని చంద్రబాబు నాయుడు తెలిపారు.
కరోనా కష్టకాలంలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన సూచించారు. 108 వాహనాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డికి పుట్టినరోజు కానుకగా రూ.307 కోట్లు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. అనుభవం ఉన్న సంస్థను పక్కకుపెట్టి విజయసాయిరెడ్డి వియ్యంకుడికి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఆయన వెల్లడించారు. కావాల్సిన వారికి కావాల్సినవి ఇచ్చుకోవడానికి తప్పుడు విధానాలతో వైఎస్సార్సీపీ ముందుకు వెళ్తోందని ఆయన హెచ్చరించారు. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు సరికాదని ఆయన స్పష్టం చేశారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశానని చెప్పిన ఆయన, ఇన్నేళ్లలో ఇలాంటి అరాచకపాలనను చూడలేదని విమర్శించారు.
ఆపరేషన్ జరిగిన వ్యక్తిని అరెస్టు చేసి నానా రకాలుగా వేధించారని మండిపడ్డారు. అనారోగ్యం ఉందని చెప్పినప్పటికీ బలవంతంగా డిశ్చార్జి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల గురించి అడిగితే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆయన విమర్శించారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని ఆయన గుర్తుచేశారు. అన్ని పనులు జరిగాక రాజధానిని మార్చుతామని ప్రభుత్వం చెబుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
ఇప్పటి వరకు 800 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని, 10 మంది ఆత్మహత్యలు చేసుకునేలా ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. సామజిక న్యాయం అంటూ పార్టీ అధికారాలను ఏ2, తన బంధువులకే కట్టపెడుతున్నారని అన్నారు. ఒక్క నాయకుడు టీడీపీ నుండి వెళ్తే వంద మంది నాయకులను తయారు చేసే శక్తి టీడీపీకి ఉందని అన్నారు. విశాఖపట్నం వెళ్తే కుట్ర పూరితంగా తనను అడ్డుకున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు 65 పైగా కేసుల్లో హైకోర్టుతో మొట్టి కాయలు తిన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తూ పద్దతి లేని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
భవనాలకు వేసిన రంగుల డబ్బులు అధికారులే కట్టే రోజులు వస్తాయని అన్నారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కరోనా విపత్తులోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బ్లీఛింగ్ పౌడర్ కు బదులు సున్నం, మైదా పిండి చళ్ళుతున్నారని మండి పడ్డారు. అమర రాజా గ్రూపు 16 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, అలంటి కంపెనీ నుండి ప్రభుత్వం ఇచ్చిన భూములు వెనక్కు తీసుకోవడం పద్దతి కాదన్నారు. ప్రపంచం అంత ఒక వైపు ఉంటే జగన్ ఒక్కడు ఒక వైపు ఉంటున్నారని అన్నారు. పెన్షన్ లోనూ వృద్ధులను మోసం చేసారని ఆరోపించారు. గురజాలలో దళితున్ని దారుణంగా హత్య చేశారని, వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.