‘కరోనా’లో కామన్ పాయింట్ ఇదీ!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విస్తరణ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మూడు వేలను దాటగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కామన్‌గా కనిపించే ఒక పాయింట్ ఉన్నది. రాష్ట్రాల్లోని మొత్తం కేసుల్లో పదింట సగటున ఏడు కేసులు కేవలం మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. సగటున ప్రతిరాష్ట్రంలో 69 శాతం కేసులు కేవలం ఆయా రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయన్న ఆసక్తికర విషయాన్ని ఓ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విస్తరణ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు మూడు వేలను దాటగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కామన్‌గా కనిపించే ఒక పాయింట్ ఉన్నది. రాష్ట్రాల్లోని మొత్తం కేసుల్లో పదింట సగటున ఏడు కేసులు కేవలం మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. సగటున ప్రతిరాష్ట్రంలో 69 శాతం కేసులు కేవలం ఆయా రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయన్న ఆసక్తికర విషయాన్ని ఓ విశ్లేషణలో వెల్లడైంది. రికవరీల సంఖ్య, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఆ జిల్లాల్లోనే నమోదవుతున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా సగటున 55.55 శాతం ఈ జిల్లాల నుంచే రికవరీ అవుతున్నారు. 63.9 శాతం కరోనా మరణాలూ అక్కడే కేంద్రీకృతమయ్యాయి.
80 శాతం కేసులు అక్కేడే..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ఈ సగటు మరింత అధికం(80శాతం)గా ఉన్నది. మహారాష్ట్రలో 89.27 శాతం కేసులు కేవలం ముంబయి, పూణె, థానెలలోనే నమోదయ్యాయి. 83శాతం మంది పేషెంట్ల రికవరీ ఈ మూడు జిల్లాల్లోనే రిపోర్ట్ అయింది. గుజరాత్‌లో 84.87 శాతం కరోనా కేసులు అహ్మదాబాద్, వడోదరా, సూరత్‌లలోనే వెలుగుచూశాయి. రాష్ట్రంలోని 52.05 రికవరీలు ఇక్కడే రిపోర్ట్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 81.51 కేసులు ఇండోర్, భోపాల్, ఖార్గావ్‌లలోనే నమోదవడం గమనార్హం.
దక్షిణాదిలోనూ కరోనా కేసుల నమోదులో ఇదే ధోరణిని చూడవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో సగటున 63 శాతం కరోనా కేసులు మూడు జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్‌లలోనే అధిక కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ వెబ్‌సైట్ లెక్కల ప్రకారం..
తెలంగాణలో 678 యాక్టివ్ కేసులు నమోదవ్వగా వాటిల్లో హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్‌లలోనే 429 కేసులుండటం గమనార్హం. పైన పేర్కొన్న విశ్లేషణ ప్రకారం.. తెలంగాణలో.. హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో.. గుంటూరు, కర్నూల్, నెల్లూరు, కర్ణాటకలో.. బెంగళూరు, మైసూరు, బెలగావీ, కేరళలో.. కాసర్‌గోడ్, కన్నూర్, ఎర్ణాకుళంలలోనే రాష్ట్రంలోని సింహభాగం కేసులు కేంద్రీకృతమై ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ అవుతున్న కేసుల్లో సరాసరి 50శాతం ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి.
తమిళనాడులో డిఫరెంట్ ట్రెండ్
బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్తాన్‌లలో సగటున 60 శాతం కరోనా కేసులు కేవలం మూడు జిల్లాల్లోనే రిపోర్ట్ అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో ఈ సగటు కాస్త స్వల్పంగా ఉన్నది. ఆగ్రా, లక్నో, గౌతమ్ బుద్ధా నగర్‌లలో రాష్ట్రంలోని 45శాతం కేసులు ఇక్కడే వెలుగుచూశాయి. తమిళనాడులో కరోనా కేసుల నమోదు మాత్రం దేశవ్యాప్త ధోరణికి భిన్నంగా ఉన్నది. రాష్ట్రమంతటా ఈ వైరస్ ఇంచుమించు సమానంగా వ్యాపించింది. చెన్నై, కోయంబత్తూర్, తిరుపూర్‌లలో 33.46 శాతం కేసులు నమోదయ్యాయి. మరో రెండు జిల్లాల్లో 79-80 స్థాయిలో.. ఇంకో మూడు జిల్లాల్లో 65-50 రేంజ్‌లో, మిగతా ఎనిమిది జిల్లాల్లో 40 నుంచి 35 మధ్య కేసులు రిపోర్ట్ అయ్యాయి.
లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి మూడువారాలు దాటిన తరుణంలో ఈ ధోరణి వెల్లడవడం గమనార్హం. ఒక చోట నుంచి మరోచోటికి వైరస్ వేగంగా పాకకుండా లాక్‌డౌన్.. కంటైన్‌మెంట్ జోన్ వంటి చర్యలు అడ్డుకుంటున్నట్టు తెలుస్తున్నది. వైరస్ పాకిన చోటే.. ఓ పరిధి మేరకు విస్తరించి ఆగిపోయినట్టు తెలుస్తున్నది. ఏ జిల్లాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాలి? ఏ జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలకు అవకాశమివ్వాలనే నిర్ణయాన్ని తీసుకునేందుకు ఈ విశ్లేషణ పనికొస్తుంది. ఇప్పటికే రెండోదశ లాక్‌డౌన్‌ను అమలు చేస్తూ కేంద్రం కంటైన్‌మెంట్ జోన్‌ల వ్యూహాన్ని అమలుచేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్ జిల్లాలను గుర్తించింది. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఈ జిల్లాలు మినహా ఇతర జిల్లాల్లో లాక్‌డౌన్ నిబంధనలను సడలించనుంది.
tags: coronavirus, spread, containment, three districts, average, india, lockdown