రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి బీఆర్‌కేఆర్ భవన్ నుంచి సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి బీఆర్‌కేఆర్ భవన్ నుంచి సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటిపారుదలశాఖ, విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు హెడ్ క్వాటర్స్ లోనే ఉండాలన్నారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులందరితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డీజీ సంజయ్ కుమార్ జైన్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ, దామోదర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.