బడి పిల్లల బియ్యానికి నిర్లక్ష్యపు గ్రహణం
‘దాచి దాచి దెయ్యాల పాటు చేసినట్టు’గా ఉంది ప్రభుత్వం తీరు. బడి పిల్లల కోసం కొనుగోలు చేసిన సన్న బియ్యానికి చెదలు పట్టింది. రూ.361 కోట్ల విలువ చేసే బియ్యం పనికి రాకుండా పోయాయి. విద్యార్థులకు పంపిణీ చేయకుండా, సరైన విధంగా నిల్వ చేయకుండా గోదాములలో దాచి పెట్టిన బియ్యం చివరికి ఎందుకూ కొరగాకుండా పోయాయి. దిశ, తెలంగాణ బ్యూరో : లాక్‌డౌన్ కారణంగా మార్చి 14 నుంచి పాఠశాలలన్నీ బంద్ చేశారు. అదే నెల మొదటి […]
‘దాచి దాచి దెయ్యాల పాటు చేసినట్టు’గా ఉంది ప్రభుత్వం తీరు. బడి పిల్లల కోసం కొనుగోలు చేసిన సన్న బియ్యానికి చెదలు పట్టింది. రూ.361 కోట్ల విలువ చేసే బియ్యం పనికి రాకుండా పోయాయి. విద్యార్థులకు పంపిణీ చేయకుండా, సరైన విధంగా నిల్వ చేయకుండా గోదాములలో దాచి పెట్టిన బియ్యం చివరికి ఎందుకూ కొరగాకుండా పోయాయి.
దిశ, తెలంగాణ బ్యూరో : లాక్‌డౌన్ కారణంగా మార్చి 14 నుంచి పాఠశాలలన్నీ బంద్ చేశారు. అదే నెల మొదటి వారంలో మధ్యాహ్న భోజనం కోసం బియ్యాన్ని తెప్పించారు. మార్చి నెలకు సంబంధించిన 43వేల క్వింటాళ్ల బియ్యం పాఠశాలలకు చేరాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పాఠశాలలు తెరుచుకోలేదు. ఎనిమిది నెలలుగా నిల్వ ఉన్న బియ్యాన్ని జాగ్రత్తగా కాపాడడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో అవి ఎలుకలు, పురుగుల పాలయ్యాయి. వాస్తవంగా బడి పిల్లల మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం లక్ష క్వింటాళ్ల సన్న బియ్యాన్ని మార్చిలోనే సేకరించింది. ఈ బియ్యంలో 43వేల క్వింటాళ్లను పాఠశాలలకు పంపింది.
ప్రతి స్కూల్ హెడ్మాస్టర్ ఎల్ఎంఎస్ పాయింట్ వద్ద నుంచి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బియ్యాన్ని తీసుకున్నారు. మిగిలిన బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేశారు. పాఠశాలలకు వచ్చిన బియ్యాన్ని అక్కడే నిల్వ చేశారు. స్కూళ్లలో నిల్వ చేసే పరిస్థితులు లేకున్నా తప్పనిసరి కావడంలో అక్కడే ఉంచారు. లాక్డౌన్తో మార్చి14 తర్వాత స్టూడెంట్స్కు మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఎనిమిది నెలల నుంచి ఎక్కడి బియ్యం బస్తాలు అక్కడే పడి ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 27వేల క్వింటాళ్లు బడుల్లోనే ఉన్నాయని చెబుతున్నారు. చాలా స్కూళ్లలో గదులు సరిగా లేకపోవడంతో బియ్యానికి పురుగులు పట్టాయి. పందికొక్కులు, ఎలుకలు తినేశాయి. బియ్యం పాడవుతున్నాయని, వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తే బాగుంటుందని ఆగస్టులో ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు నివేదించారు. అందుకు నిబంధనలు ఒప్పుకోవని, పాఠశాలలు మొదలైన తర్వాత వాటిని మధ్యాహ్న భోజనానికి వినియోగించాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి.
రాష్ట్రంలోని 28,621 స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. 23,87,751 మంది విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. వీరిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులు 11,95,440 మంది, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు 7,18,428 మంది, 9,10వ తరగతుల్లో 4,73,883 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైమరీ స్టూడెంట్స్కు రోజుకు 100 గ్రాములు, హైస్కూల్ స్టూడెంట్స్కు 150 గ్రాములు సన్నబియ్యంతో భోజనాన్ని అందిస్తున్నారు. ఎనిమిదో తరగతి వరకు అయ్యే భోజన ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా ఉండగా, స్టేట్ గవర్నమెంట్ది 40 శాతం ఉంటోంది. 9,10 తరగతుల పిల్లలకు అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
రూ.361 కోట్ల నష్టం
విద్యార్థులకు పంపిణీ చేయకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దాచిన సన్నబియ్యం 60 వేల క్వింటాళ్లు గోదాముల్లో ఉండగా, 27 వేల క్వింటాళ్లు పాఠశాలల్లో నాశనమయ్యాయి. మొత్తం ఈ బియ్యానికి రూ. 361 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే అంచనా వేశారు. ఓ వైపు లాక్‌డౌన్ నేపథ్యంలో తిండికి కూడా కరువై అర్థాకలితో పేదలు అలమటిస్తే… ప్రభుత్వం మాత్రం నిబంధనల పేరుతో వందల కోట్ల సన్న బియ్యానికి చెదలు పట్టించింది.