డబ్బు లేని జీవనం గడపాలని ఉందా..? ‘ఆరోవిల్’కు వెళ్లాల్సిందే!
దిశ, ఫీచర్స్ : ‘ద్రవ్యం’ లేని కాలంలో ప్రజలు ‘వస్తు వినిమయ పద్ధతి’(వస్తు మార్పిడి) పాటించేవారని పుస్తకాల్లో చదువుకున్నాం. మనకు కావాల్సిన వస్తువు తీసుకుని, బదులుగా మరో వస్తువును వాళ్లకు ఇవ్వడం అన్నమాట. ఆర్థిక వ్యవహారాలు పెరిగే కొద్దీ వస్తు విలువల్లో తేడా, కోరికల్లో భిన్నత్వం, విలువల కొలమానంలో బేధాల వల్ల ఈ విధానం పోయి ‘కరెన్సీ’ వాడకం వచ్చింది. ప్రస్తుతం ఆ ‘డబ్బే’ ప్రపంచాన్ని శాసిస్తోంది. మానవాళిని పరుగులు పెట్టిస్తోంది. ఇలాంటి తరుణంలో తమిళనాడులోని ఆరోవిల్ […]
దిశ, ఫీచర్స్ : ‘ద్రవ్యం’ లేని కాలంలో ప్రజలు ‘వస్తు వినిమయ పద్ధతి’(వస్తు మార్పిడి) పాటించేవారని పుస్తకాల్లో చదువుకున్నాం. మనకు కావాల్సిన వస్తువు తీసుకుని, బదులుగా మరో వస్తువును వాళ్లకు ఇవ్వడం అన్నమాట. ఆర్థిక వ్యవహారాలు పెరిగే కొద్దీ వస్తు విలువల్లో తేడా, కోరికల్లో భిన్నత్వం, విలువల కొలమానంలో బేధాల వల్ల ఈ విధానం పోయి ‘కరెన్సీ’ వాడకం వచ్చింది. ప్రస్తుతం ఆ ‘డబ్బే’ ప్రపంచాన్ని శాసిస్తోంది. మానవాళిని పరుగులు పెట్టిస్తోంది. ఇలాంటి తరుణంలో తమిళనాడులోని ఆరోవిల్ కమ్యూనిటీ తమ సొంత ‘వర్చువల్ కరెన్సీ’తో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
‘ఆరోవిల్’ ఇదో అంతర్జాతీయ టౌన్‌షిప్. ఇక్కడ ప్రజలు ఒక దేశానికి చెందిన వాళ్ళుకాదు. వీరికి కులం, మతం, సంప్రదాయాలు, ఆచారాలు అంటూ ఏమీ ఉండవు. పౌరసౌత్వం కూడా ఉండదు. ప్రపంచంలో ఎవరైనా సరే ఈ గ్రామానికి వచ్చి జీవించొచ్చు. ప్రస్తుతం 50 దేశాలకు చెందిన మూడు వేలకుపైగా ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ ఆధ్యాత్మిక గురువు మీరా మదర్ 1968లో ఆరోవిల్‌ను స్థాపించింది. ‘అరవిందు’ని స్ఫురించేలా దీనికి ‘ఆరోవిల్’ అనే పేరు పెట్టారు. వివిధ దేశాల జాతీయతలన్నింటినీ అధిగమించి ఏ భేదభావం లేకుండా మానవులంతా కలసిమెలసి ఉండాలనే ఉద్దేశంతో ఈ గ్రామం ప్రారంభమైంది. ఇక ఇక్కడి ప్రజలు డబ్బులని ఉపయోగించరు. తమ తమ పనులకు, సేవలకు, వస్తువులకు ఒకరి దగ్గర మరొకరు డబ్బులు తీసుకోరు. పేపర్ కరెన్సీ, నాణేల బదులుగా ప్రత్యేక ఆరో డెబిట్ కార్డు ఉపయోగిస్తారు.
తొలి నుంచి ‘మనీ-లెస్’ గ్రామంగా దీన్ని తీర్చిదిద్దాలని మదర్ భావించారు. డబ్బు అవసరం లేని సమాజాన్ని సాధించేందుకు ఆరోవియన్లు అనేక ప్రయోగాలు చేశారు. నిత్యావసరాల కోసం ఉచిత పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఒకరి అవసరాలు మరొకరు తీర్చేందుకు ప్రోత్సహించడం లాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టినా.. నగదు రహిత సమాజం ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. ఆ సమయంలోనే దక్షిణ కొరియా యునిస్ట్‌లో పనిచేసే అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ చో జే-వీన్ ఎకో ఫ్రెండ్లీ ‘బీవీ’ టాయిలెట్ ప్రాజెక్ట్ రూపొందించాడు. ఈ టాయిలెట్ మానవ విసర్జిత పదార్థాలతో ‘పవర్’ జనరేట్ చేస్తుంది. అయితే పర్యావరణ అనుకూల మరుగుదొడ్డిని ఉపయోగించే ప్రతి విద్యార్థి వర్చువల్ మనీ సంపాదించుకోవచ్చనేది కాన్సెప్ట్. ఇందుకోసం ఆయన ‘జీగూల్’ కరెన్సీ యాప్ డిజైన్ చేశాడు. ఈ తరహా ప్రాజెక్ట్ కోసం ఆరోవిల్లేకు వచ్చిన చో జే కూతురు ‘27 ఏళ్ల డాన్ బీ కిమ్’ 2019లో ‘ఆరో’ మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఆరోవియన్లకు తగ్గట్లుగా ఆ ప్రాజెక్ట్‌లో పలు మార్పులు చేశారు.
యాప్ డౌన్‌లోడ్ చేసిన ప్రతి ఆరోవిలియన్ ‘12’ ఆరాలు పొందుతారు. ఇందులో మూడు ఆరాలను మాత్రం ఇతర ఆరోవియన్ల మార్కెట్‌లో ఉపయోగించాలి. ఇక ఆరో యాప్‌లో ‘సెల్’, ‘బై’ అనే పదాలకు బదులుగా ‘ఆఫర్’ అండ్ రిసీవ్ కనిపిస్తాయి. ఇక వస్తువు ధరలతో పాటు తాము తీసుకున్న సర్వీస్‌కు వినియోగదారులే ధర నిర్ణయిస్తారు కాబట్టి, స్థిరమైన విలువ ఉండదు. ఆరోవిలియన్లు స్థిర విలువలను విచ్ఛిన్నం చేసేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఒక వ్యక్తి తోటపని చేసేందుకు ఈ ఆరో యాప్ ఉపయోగిస్తే, మరికొందరు తోటపని, పాఠాలు, స్నేహితులతో బీచ్ పర్యటన లేదా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని అందించేందుకు వినియోగిస్తారు. పది నిమిషాల మసాజ్‌కు రెండు ఆరాలు మాత్రమే. మ్యాథ్స్ క్లాస్‌కు మూడు ఆరాలే అంటూ ఆరోవియన్లు తమ షర్ట్‌పై బ్యాడ్జీలు ధరిస్తారు.
‘ఆరా అనేది మార్కెట్ నిర్ణయించిన ధరలపై కచ్చితంగా ఆధారపడని ప్రత్యామ్నాయ కరెన్సీ. షరతులు లేని ఎండోమెంట్‌లతో స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ప్రజలు తమ సేవలను ప్లాట్‌ఫామ్‌పై ఎంత విలువైనదిగా చూస్తారో గమనించడం ఒక సామాజిక ప్రయోగం. ధర పోలికలు లేదా సూచనలు లేనప్పుడు ప్రజలు నిర్దిష్ట వస్తువులు, సేవలను నిర్దిష్ట పరిధిలో విలువైనదిగా భావించరు. ఇక్కడ వ్యర్థాలుగా పరిగణించే విషయాలను మొదట గుర్తించి వాటిని ఉపయోగపడేలా తిరిగి తయారుచేస్తాం. డబ్బు పేరుకుపోవద్దు అది నిరంతరం ప్రవహించాలి.
– కిమ్
నిర్దిష్ట ఉద్యోగాలలో పనిచేసే ఆరోవిలియన్లు వారి వ్యక్తిగత ఖాతాలో నెలవారీ స్టైఫండ్ పొందుతారు. మెయింటెనెన్స్‌లలో మూడింట ఒక వంతు నగదును రూపాయలకు మార్పిడి చేసుకోవచ్చు, మిగిలినవి ఆరోవిల్‌లో వస్తువులు సేవలకు మాత్రమే ఉపయోగపడే స్థానిక కరెన్సీగా పనిచేస్తాయి. అయితే సగం మంది అరోవిలియన్లు డబ్బును స్వీకరించరు ఎందుకంటే తమను తాము “స్వయం సహాయకులు” అని అభివర్ణించుకుంటారు. నివాసితులు ప్రామాణిక నెలవారీ సహకారాన్ని చెల్లిస్తారు. ఇది 1989 లో 200 రూపాయల నుండి ప్రారంభమై 2018లో 3,150 రూపాయలకు పెరిగింది. ఆరోవిల్లెలోని వాలంటీర్లు నెలకు 900 రూపాయలు అందించాలి. సందర్శకుల వసతి రుసుములో అదనంగా 20% సాధారణ బడ్జెట్‌లో వసూలు చేస్తారు. ఇది చాలావరకు నగర ఖర్చులకు కేటాయిస్తారు. వీటిలో ఎక్కువ భాగం మెయింటెనెన్స్, విద్యకు కేటాయిస్తారు.