ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కారణంగా సందిగ్ధంలో పడిన విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వచ్చేనెల (ఆగస్టు) 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, […]

Update: 2020-07-16 11:07 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కారణంగా సందిగ్ధంలో పడిన విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. వచ్చేనెల (ఆగస్టు) 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర విషయాలపై యుజిసి, ఎఐసిటిఇ తదితర సంస్థల మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌లో గురువారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల పనితీరును గణనీయంగా మెరుగుపరచాలని, ఉత్తమ విద్యాబోధన జరిగేలా చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పుడే విద్య పేరు మీద జరుగుతున్న దోపిడిని అరికట్టడం సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని, ప్రైవేటు సంస్థల దోపిడీ ఆగిపోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇతర ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటిని గొప్పగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఏం చేయాలి? తదితర విషయాలపై త్వరలోనే ఓ వర్క్‌షాప్ నిర్వహించి విద్యారంగ నిపుణులు, అనుభవజ్ఞుల అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈ క్రింది నిర్ణయాలు జరిగాయి :

– విద్యావ్యవస్థ పవిత్రతను కాపాడే ఉద్దేశ్యంతో యూజీసీ, ఏఐసీటీఈ సూచించిన మేరకు రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించి మిగతావారిని ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలి.
– విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం రూపొందిస్తుంది.
– రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడు చేయాలి, విద్యాబోధన ఎలా జరగాలి తదితర విషయాలపై కేంద్రం మార్గదర్శకాలను, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి, రాష్ట్రంలో ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగిస్తున్నామని, ఇప్పుడు విద్యా వ్యవస్థపై దృష్టి సారించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, వ్యవసాయం తదితర రంగాలు కొలిక్కి వచ్చాయని తెలిపారు. భూకబ్జాలు, పేకాట క్లబ్బులు, గుడుంబా బట్టీలు లేవన్నారు. ఇకపైన రెవెన్యూ శాఖ ప్రక్షాళనపైన దృష్టి సారించనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సీఎం ప్రశంస

విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో ఇద్దరు అధ్యాపకుల ప్రస్తావన వచ్చింది. కొద్దిమంది అధ్యాపకులు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా మొక్కలు నాటడం లాంటి సామాజిక కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని సిఎం కేసీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బాట్నీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సదాశివయ్య, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ హెడ్‌మాస్టర్ డాక్టర్ పీర్ మహ్మద్ షేక్ గురించి ఆ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. వీరిద్దరూ విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచుతున్నందున ప్రోత్సహించి ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటడంతో పాటు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన సదాశివయ్యతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లో మాట్లాడి అభినందించారు.

జడ్చర్లలో బొటానికల్ గార్డెన్‌కు సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలతో విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌ను కలిసి తన దగ్గరకు రావాలని, వెంటనే దానికి సంబంధించిన అనుమతులు, ఆర్థిక వనరులను తీసుకెళ్ళాలని సదాశివయ్య అనే ఉపాధ్యాయుడికి సీఎం ఫోన్‌లో మాట్లాడి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, శ్రీహరి, శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News