ఐపీఎల్ మినీ వేలం ఆన్‌లైన్‌లోనే..!

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం ఫిబ్రవరి 18న చెన్నైలో జరుగనున్నది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు తర్వాత బీసీసీఐ బోర్డు సభ్యులతో పాటు ఐపీఎల్ కౌన్సిల్ సభ్యులు కూడా అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో గురువారం నుంచి వేలం పాట నిర్వహించాలని భావించారు. అయితే రెండో టెస్టు ఒక రోజు ముందుగానే ముగియడంతో ఐపీఎల్ వేలం కోసం బీసీసీఐ సభ్యులు చెన్నైలోనే ఉండిపోయారు. కానీ, కరోనా కారణంగా విదేశీ ప్రయాణాలపై కూడా […]

Update: 2021-02-16 10:32 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం ఫిబ్రవరి 18న చెన్నైలో జరుగనున్నది. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు తర్వాత బీసీసీఐ బోర్డు సభ్యులతో పాటు ఐపీఎల్ కౌన్సిల్ సభ్యులు కూడా అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో గురువారం నుంచి వేలం పాట నిర్వహించాలని భావించారు. అయితే రెండో టెస్టు ఒక రోజు ముందుగానే ముగియడంతో ఐపీఎల్ వేలం కోసం బీసీసీఐ సభ్యులు చెన్నైలోనే ఉండిపోయారు. కానీ, కరోనా కారణంగా విదేశీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు ఉండటంతో చాలా ఫ్రాంచైజీల కెప్టెన్లు, కోచ్‌లతో సహా.. సీఈవో, డైరెక్టర్లు అందుబాటులో లేకుండా పోయారు. విదేశీ కోచ్, కెప్టెన్, సీఈవోలు కలిగిన ఫ్రాంచైజీలు ఈ విషయంపై బీసీసీఐకి అభ్యంతరం తెలిపాయి. విదేశీ ప్రయాణాలు లేనందున కనీసం ఆన్‌లైన్‌లో వేలంలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరాయి.

కొన్ని షరతులతో..

ఐపీఎల్ వేలం జరిగితే ఫ్రాంచైజీ తరఫున పరిమిత సంఖ్యలోనే సభ్యులను అనుమతిస్తారు. సాధారణంగా ఫ్రాంచైజీ ఓనర్ లేదా వారి తరఫున ఇద్దరిని, కోచ్, కెప్టెన్, మెంటార్‌లను వేలానికి అనుమతిస్తారు. అయితే ఐపీఎల్‌లో చాలా ఫ్రాంచైజీలకు విదేశీ కోచ్, సీఈవోలు ఉన్నారు. వాళ్లు వేలం కోసం ఒక రోజు రావడానికి 14 రోజుల క్వారంటైన్ అవసరం పడుతున్నది. దీంతో కొన్ని ఫ్రాంచైజీలు తమ తరఫున వేలంలో పాల్గొనే వ్యక్తులను ఆన్‌లైన్ ద్వారా హాజరు కావడానికి అనుమతించాలని కోరాయి. దీనిపై గత రెండు రోజులుగా తర్జనభర్జనలు పడిన బీసీసీఐ ఎట్టకేలకు ఆన్‌లైన్ ద్వారా కేవలం పరిమిత సంఖ్యలో సభ్యులను అనుమతించడానికి ఒప్పుకున్నది. వేలంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనే వ్యక్తులు కేవలం క్రికెటర్లను కొనడానికి బెట్ చేయడం తప్ప.. మిగతా వాటికి అనుమతించరని బీసీసీఐ చెప్పింది.

ఆ ఫ్రాంచైజీలకే..

ఐపీఎల్‌లో విదేశీ కెప్టెన్లు లేదా కోచ్‌లు ఉన్న జట్లు చాలా ఉన్నాయి. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లలో చాలా మంది విదేశీ సిబ్బంది ఉన్నారు. ఢిల్లీ జట్టు కోచ్ రికీపాంటింగ్, ఆర్సీబీ జట్టులోని కోచ్, సహ సిబ్బంది ఆసీస్‌కు చెందిన వాళ్లే. మరోవైపు పంజాబ్, చెన్నైలోని కోచింగ్ స్టాఫ్ కూడా విదేశీయులే. దీంతో ఈ ఫ్రాంచైజీలన్నీ తమకు ఆన్‌లైన్ ద్వారా వేలంలో పాల్గొనడానికి అనుమతులు ఇవ్వాలని మెయిల్ ద్వారా కోరాయి. ఇదే విషయం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు కూడా చేరవేశాయి. ఫ్రాంచైజీల అభ్యర్థనను అంగీకరించి బీసీసీఐ ఫిబ్రవరి 18న జరిగే వేలానికి ఫ్రాంచైజీకి కేవలం ఒకరిని మాత్రమే ఆన్‌లైన్ ద్వారా పాల్గొనడానికి అంగీకరిస్తామని చెప్పింది. కోచ్ లేదా మెంటార్ ఒకరు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చని.. మిగతా వాళ్లు తప్పకుండా ప్రత్యక్షంగా వేలంలో ఉండాలని స్పషం చేసింది.

Tags:    

Similar News