ఎక్కిళ్లు కూడా కరోనా లక్షణమేనా?
దిశ, వెబ్‌డెస్క్ : మనిషికి ‘ఎక్కిళ్లు’ రావడం చాలా సహజం. చిన్నపిల్లలకైతే తరుచుగా వస్తుంటాయి. అయితే ఈ కరోనా టైమ్‌లో ఎక్కిళ్లు ఆగకుండా వస్తే మాత్రం.. కాస్త ఆలోచించాల్సిందేనని వైద్య నిపుణులు అంటున్నారు. అదేంటి? ఎక్కిళ్లు కూడా కరోనా సంకేతమా? తెలుసుకోండి. కరోనా వల్ల కొందరిలో అసహజమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాల జాబితా కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. కండ్ల కలక, దద్దుర్లు, వాసన, రుచి కోల్పోవడం.. ఇలా భిన్నమైన లక్షణాలను కరోనా సింప్టమ్స్ జాబితాలో […]
దిశ, వెబ్‌డెస్క్ :
మనిషికి ‘ఎక్కిళ్లు’ రావడం చాలా సహజం. చిన్నపిల్లలకైతే తరుచుగా వస్తుంటాయి. అయితే ఈ కరోనా టైమ్‌లో ఎక్కిళ్లు ఆగకుండా వస్తే మాత్రం.. కాస్త ఆలోచించాల్సిందేనని వైద్య నిపుణులు అంటున్నారు. అదేంటి? ఎక్కిళ్లు కూడా కరోనా సంకేతమా? తెలుసుకోండి.
కరోనా వల్ల కొందరిలో అసహజమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాల జాబితా కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. కండ్ల కలక, దద్దుర్లు, వాసన, రుచి కోల్పోవడం.. ఇలా భిన్నమైన లక్షణాలను కరోనా సింప్టమ్స్ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆగకుండా ఎక్కిళ్లు రావడమూ కరోనా కొత్త లక్షణం కావొచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ, చాలా రోజులు ఎక్కిళ్ళు వచ్చిన వ్యక్తిలో కరోనా వైరస్ పాజిటివ్ ఉంటేనే ఇలాంటి లక్షణం బయటకు కనిపిస్తుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఓ కేసుకు సంబంధించిన రిపోర్ట్‌లో ఇలాంటి అనుభవమే ఎదురుకావడం గమనార్హం.
చికాగోకు చెందిన 62 ఏళ్ల వ్యక్తికి డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. అతను రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉంటాడు. అయితే, వైద్యుల పరిశీలనలో అతడు నాలుగు నెలల్లో 30 కిలోల వరకు బరువు తగ్గాడు. ఈ క్రమంలో ఇటీవల అతనికి నాలుగు రోజుల నుంచి నిరంతరాయంగా ఎక్కిళ్లు రావడం మొదలై, ఎంతకీ తగ్గడం లేదు. కానీ అంతా నార్మల్‌గానే ఉంది. జ్వరం, దగ్గు, జలుబు లాంటివి లేవు. గొంతు నొప్పి కూడా లేదు. కానీ అసాధారమైన లక్షణంగా ఎక్కిళ్లు వస్తుండటంతో డాక్టర్లకు అనుమానమొచ్చి కరోనా టెస్టు చేయించారు. కాగా, అతడికి పాజిటివ్ అని తేలింది.
వెంటనే వైద్యులు ఆ వ్యక్తికి చెస్ట్ స్కాన్ చేశారు. కరోనా అతని ఊపిరితిత్తుల సామర్థ్యంపై ప్రభావం చూపింది. కానీ ఇతర లక్షణాలేవీ కూడా కనిపించలేదు. దాంతో రోగిని ఐసోలేషన్ చేర్చారు. అతడికి న్యుమోనియా చికిత్స అందించారు. అనంతరం అతడిని కొవిడ్ సెంటర్‌కు తరలించారు. నిరంతరం ఎక్కిళ్ళు రావడమనే లక్షంతో కరోనా పాజటివ్‌గా తేలిన మొదటి కేసు ఇదే అని డాక్టర్లు పేర్కొన్నారు. ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్’లో ఇటీవలే ఈ కేసు రిపోర్ట్ ప్రచురితమైంది.
ఇకపై ఆగకుండా ఎక్కిళ్లు వస్తే కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ కేసు వల్ల తెలిసింది.