సచివాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయానికి రాష్ట్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నెల 1న జారీ అయిన పర్యావరణ అనుమతుల్లో కొన్ని సవరణలు చేయాలంటూ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీకి సిఫారసు చేసింది. రోడ్లు భవనాల శాఖ రూపొందించిన డిజైన్‌తో పోలిస్తే విస్తీర్ణం సుమారు 33 వేల చదరపు అడుగుల మేర పెరిగింది. కొన్ని కొత్త కట్టడాలు కూడా ప్రాంగణంలో వస్తున్నందున వాటికి కూడా […]

Update: 2020-09-24 20:51 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయానికి రాష్ట్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నెల 1న జారీ అయిన పర్యావరణ అనుమతుల్లో కొన్ని సవరణలు చేయాలంటూ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీకి సిఫారసు చేసింది. రోడ్లు భవనాల శాఖ రూపొందించిన డిజైన్‌తో పోలిస్తే విస్తీర్ణం సుమారు 33 వేల చదరపు అడుగుల మేర పెరిగింది. కొన్ని కొత్త కట్టడాలు కూడా ప్రాంగణంలో వస్తున్నందున వాటికి కూడా మదింపు కమిటీ అనుమతి ఇచ్చింది. సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు కానున్నట్లు పేర్కొన్నప్పటికీ మదింపు కమిటీ సమావేశం సమయానికి రూ.617 కోట్లకు చేరింది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం హుస్సేన్ సాగర్ పక్కన భారీ స్థాయి శాశ్వత కట్టడాన్ని నిర్మించరాదని, తాజాగా జారీ అయిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సౌల్) మాజీ కన్వీనర్ లుబ్నా సర్వత్ గురువారం కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ టెక్నికల్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. నూతన సచివాలయ నిర్మాణం కోసం ఆగస్టులోనే పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయని, ఎయిర్ పోర్టు అథారిటీ నుంచి కూడా అనుమతి లభించిందని రోడ్లు భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ మదింపు కమిటీకి స్పష్టం చేశారు. ఆ ప్రకారం ఈ నెల 21న జరిగిన సమావేశానికి ఇంజినీర్‌తో పాటు పర్యావరణ నిర్వహణ ప్లాన్ రూపొందించిన ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. సాంకేతిక, పర్యావరణ, ఆర్థిక అంశాలను కమిటీ సభ్యులకు వివరించారు. ఆరుగురు సభ్యులు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ నెల జారీ చేసిన ఈసీకి తాజా మార్పులతో సవరణలు చేయాల్సిందిగా సిఫారసు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ ప్రకారం మొత్తం జీ+11 అంతస్తుల (సెల్లార్ అదనం)తో నిర్మాణమయ్యే ఈ భవనం మొత్తం విస్తీర్ణం 61,914.67 చ.మీ.గా ఉంటుంది. ఈ మేరకే గత నెలలో ఈసీ కూడా మంజూరైంది. కానీ ఇప్పుడు ఆ విస్తీర్ణం సుమారు 3,049 చ.మీ. (33,096 చ.అ) మేర పెరుగుతోంది. దీనికి తోడు ప్రాంగణంలో కొత్తగా జీ+2 అంతస్తులతో ఒక భవనం (సెక్యూరిటీ, డ్రైవర్ల కోసం) నిర్మించనున్నట్లు మదింపు కమిటీ సమావేశంలో ఈ ప్రతినిధులు ప్రతిపాదించారు. దీంతో పార్కింగ్ స్థలం కూడా స్వల్పంగా పెరగనుంది. రోడ్ల వెడల్పు కార్యక్రమానికి అదనంగా 7,122 చ.మీ. స్థలం అవసరమవుతున్నందున మొత్తం సచివాలయ ప్రాంగణం విస్తీర్ణం 26.29 ఎకరాల నుంచి 28.05 ఎకరాలకు (అదనంగా 1.76 ఎకరాలు) పెరిగింది. దీనికి తగినట్లుగా మొత్తం సచివాలయ నిర్మాణ వ్యయం కూడా రూ.400 కోట్ల నుంచి రూ.617 కోట్లకు పెరుగుతోంది. తొలుత ప్రభుత్వం రూ.400 కోట్లు అని అంచనా వేసినా టెండర్ నోటిఫికేషన్‌‌లో మాత్రం రూ.500 కోట్లుగా పేర్కొంది. ఇప్పుడు అది మరింతగా పెరిగి రూ.617 కోట్లకు చేరుకుంది. నిర్మాణం మొదలై చివరి దశకు చేరుకునే సమయానికి ఇంకెంత మేరకు పెరుగుతుందనేది చర్చనీయాంశం.

ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఇన్‌ఫర్మాటిక్స్ డివిజన్ టెక్నికల్ డైరెక్టర్‌కు ‘సౌల్’ మాజీ కన్వీనర్, సోషలిస్టు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీలుబ్నా సర్వత్ గురువారం లేఖ రాశారు. ఈ నెల 1న ఈసీ ఉత్తర్వులను, సెప్టెంబరు 23న మదింపు కమిటీ చేసిన సిఫారసులను రద్దు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల శాశ్వత కట్టడాలకు అనుమతి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు 2005లో జారీచేసిన ఉత్తర్వులను తు.చ. తప్పకుండా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తప్పుడు వివరాలను సమర్పించిన ప్రైవేటు సంస్థ (పృథ్వీ కన్సల్టెంట్) అక్రెడిటేషన్‌ను రద్దు చేయాలని కోరారు.

Tags:    

Similar News