నిర్మల్ రాజకీయాల్లో కీలక పరిణామం
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, మరో ఇద్దరు కౌన్సెలర్లు బీజేపీలో చేరారు. అలాగే టిఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఒక జెడ్పిటిసి సభ్యురాలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్, మరో ఇద్దరు కౌన్సెలర్లు బీజేపీలో చేరారు. అలాగే టిఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఒక జెడ్పిటిసి సభ్యురాలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిర్మల్ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. మారిన రాజకీయ సమీకరణల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గతంలో చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్న గణేష్ చక్రవర్తి ఇంద్రకరణ్ రెడ్డి వెంటే నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలకు మంత్రితో కలిసి వెళ్లారు. 2018 ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డితో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డితో సఖ్యతగా ఉండలేకపోయారు.
ఇక వచ్చే ఎన్నికల్లో నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతూ బీజేపీలో చేరారు. ఎన్ఎస్‌యుఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన గణేష్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన తాత అప్పాల నరసయ్య, చిన్నమ్మ అప్పాల అనురాధలు కూడా మున్సిపల్ చైర్మన్ పని చేశారు. నిర్మల్ పట్టణంలో ఆయనకు బలమైన అనుచరగణం ఉంది అనుచరగణం ఉన్నది.
అలాగే బిసి సామాజిక వర్గానికి చెందిన నేతగా పేరు ఉంది. తాజాగా ఆయన బిజెపిలో చేరడంతో నియోజకవర్గ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనతో పాటే ఇద్దరు కౌన్సిలర్లు కత్తి నరేందర్, ఉమా శ్రీధర్, మరికొంత మంది ముఖ్య అనుచరగణం కూడా బీజేపీలో చేరారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఈ చేరిక విషయంలో ముఖ్య భూమిక పోషించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాషాయ కండువా కప్పి వీరిని బిజెపిలోకి ఆహ్వానించారు.
టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యురాలు కూడా..
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన జెడ్పిటిసి సభ్యురాలు భూక్యా జానునాయి కూడా బీజేపీలో చేరారు. అప్పాల గణేష్‌తో కలిసి మంగళవారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గంలోని పెంబి మండల జెడ్పిటిసి సభ్యురాలుగా ఆమె ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. తర్వాత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఆమె బిజెపి తీర్థం పుచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గ బిజెపి నేతలు సాదం అరవింద్, అయ్యన్న గారి భూమయ్య, రావుల రామ్‌నాథ్ ఉన్నారు.