పాపం.. ప్రాధేయపడుతున్నా కనికరించడం లేదు

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో తెలంగాణ కేబినెట్‌ భేటీ అయి మరోసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించనుందన్న ఊహాగానాల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో ఏపీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. దీంతో హైదరాబాదులోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కనపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్‌తో పాటు, కొరపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనపడింది. యాదాద్రి […]

Update: 2020-07-02 03:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో తెలంగాణ కేబినెట్‌ భేటీ అయి మరోసారి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించనుందన్న ఊహాగానాల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి పెద్ద సంఖ్యలో ఏపీ వాసులు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. దీంతో హైదరాబాదులోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కనపడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్‌తో పాటు, కొరపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ కనపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి జీఎమ్మార్‌ టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వెళ్లే వైపు వాహనాలు మెల్లిగా ముందుకు కదులుతున్నాయి.

హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై కూడా భారీగా రద్దీ ఉండడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు‌, ఈ-పాసులు లేకపోవడంతో కొన్ని వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో సొంతూళ్లకు వెళ్దామనుకున్న కొందరు నిరాశతో వెనుదిరుగుతున్నారు. రామాపురం చెక్‌పోస్ట్‌ వద్ద కూడా భారీగా వాహనాలు కనపడ్డాయి. మరోవైపు అనుమతి లేకుండా ఎవరూ ఆంధ్రాలోకి ప్రవేశించవద్దని అధికారులు చెబుతున్నారు. దీంతో అటు పొందుగల, ఇటు గరిపాడు చెక్ పోస్టు వద్దకు పెద్ద ఎత్తున ఏపీ ప్రజలు తరలివచ్చారు. స్వస్థలాలకు వెళ్లాలని ప్రాధేయపడినప్పటికీ పాసులు లేకుంటే అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఏపీ వాసులు అక్కడే వేచి చూస్తున్నారు. దీంతో ఆంధ్రా, తెలంగాణ సరిహద్దుల్లో ఏపీకి రాకపోకలపై నిఘా మరింత ఎక్కువైంది.

దీంతో ఏపీ వాసుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. తెలంగాణలో పరీక్షలు నిర్వహిస్తున్న కొద్దీ కేసులు బయటపడుతున్నాయి. ఏపీ ఆంక్షలు సడలించడం లేదు. దీంతో చెక్ పోస్టుల వద్దకు చేరుకున్నవారికి ఏం చేయాలో అర్ధం కావడం లేదు. కాళ్లా వేళ్లా పడదామన్నా సామాజిక దూరం నేపథ్యంలో ఎవరూ వారిని దరిదాపులకు కూడా రానివ్వడం లేదు. పిల్లాపాపలతో రోడ్డెక్కిన చాలా మందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.

Tags:    

Similar News