4రోజుల్లోనే లక్ష టెస్టులు

దిశ, ఏపీ బ్యూరో: కరోనా టెస్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 10,33,852 కొవిడ్ పరీక్షలు నిర్వహించి దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన టాప్-3 రాష్ట్రాల్లో ఏపీ నిలిచింది. కేవలం నాలుగు నెలల్లోనే రోజుకు 34వేలకు పైగా పరీక్షలు నిర్వహించగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. భారీ ఎత్తున టెస్టులు చేస్తూ, కొవిడ్ పాజిటివ్ వ్యక్తులను గుర్తించి, వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. తొలి శాంపిల్‌ హైదరాబాద్‌కు.. కరోనా ఆరంభంలో ఏపీలో వైరాలజీ ల్యాబొరేటరీ […]

Update: 2020-07-06 11:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: కరోనా టెస్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 10,33,852 కొవిడ్ పరీక్షలు నిర్వహించి దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన టాప్-3 రాష్ట్రాల్లో ఏపీ నిలిచింది. కేవలం నాలుగు నెలల్లోనే రోజుకు 34వేలకు పైగా పరీక్షలు నిర్వహించగల సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. భారీ ఎత్తున టెస్టులు చేస్తూ, కొవిడ్ పాజిటివ్ వ్యక్తులను గుర్తించి, వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది.

తొలి శాంపిల్‌ హైదరాబాద్‌కు..

కరోనా ఆరంభంలో ఏపీలో వైరాలజీ ల్యాబొరేటరీ లేకపోవడంతో ఫిబ్రవరి 1న తొలి నమూనాను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. అనంతరం మార్చి 7న తిరుపతిలో తొలి వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా జిల్లాకొకటి చొప్పున 14ల్యాబ్‌లను ప్రారంభించారు. కేంద్రం ఆధ్వర్యంలోని మంగళగిరి ఎయిమ్స్‌ ల్యాబ్‌తో కలిపితే వీటి సంఖ్య 15కు చేరుతుంది. ఇక ప్రైవేట్‌లో 4ల్యాబ్‌లున్నాయి

మొదటి లక్ష టెస్టులకు 59రోజుల సమయం

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి లక్ష కరోనా టెస్టులు పూర్తి చేయడానికి 59రోజుల సమయం పట్టగా, 10వ లక్ష టెస్టులు చేయడానికి నాలుగు రోజులు మాత్రమే పట్టింది. చివరి మూడు లక్షల టెస్టులు కేవలం 12రోజుల్లో పూర్తి చేశారు. కరోనా కట్టడికి వ్యక్తిగత శుభ్రత, సామాజికదూరం పాటించడం ఎంత ముఖ్యమో, కరోనా పాజిటివ్‌ రోగులను గుర్తించడమూ అంతే ముఖ్యం. ఈ రెండు వ్యూహాలనూ ఏపీ ప్రభుత్వ యంత్రాంగం విజయవంతంగా అమలు చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కరోనా ప్రభావం మొదలయ్యే నాటికి రాష్ట్రంలో టెస్టింగ్‌కు సంబంధించిన వనరులు లేకున్నా, అప్రమత్తమైన ప్రభుత్వం ముందుచూపుతో భారీ ఎత్తున టెస్టింగ్ పరికరాలను సమకూర్చుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 14 వైరాలజీ ల్యాబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. ఇవికాకుండా 47 ట్రూనాట్‌ మెషీన్లు, సీబీనాట్, నాకో ల్యాబొరేటరీలు, క్లియా మెషిన్ల ద్వారా కూడా పరీక్షలు చేస్తున్నారు. మొత్తం 78ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయి.

3రాష్ట్రాల్లోనే 10లక్షలకు పైగా టెస్టులు

దేశంలో ఇప్పటివరకు కేవలం మూడు రాష్ట్రాలే 10లక్షలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించాయి. తమిళనాడులో 13.06లక్షలు, మహారాష్ట్రలో 10.85లక్షల టెస్టులు నిర్వహించగా, ఏపీలో 10.33లక్షల టెస్టులు పూర్తి చేశారు. అయితే, మహారాష్ట్ర, తమిళనాడులు 10లక్షల టెస్టులు నిర్వహించినప్పటికీ, జనాభా పరంగా ఆ రెండు రాష్ట్రాలూ ఏపీ కంటే పెద్దవి కావడం గమనార్హం. పాజిటివిటీ రేటు పరంగానూ ఏపీ మెరుగైన స్థితిలోనే ఉంది. తమిళనాడులో పాజిటివిటీ రేటు 8.19శాతం, మహారాష్ట్రలో 18.44శాతం ఉండగా, ఏపీలో 1.84శాతం మాత్రమే ఉంది.

Tags:    

Similar News