నల్లగొండ జిల్లా పోలీసు శాఖ మరో రికార్డు
దిశ ప్రతినిధి, నల్లగొండ: అది నల్లగొండ జిల్లా పోలీసు శాఖ. సాధారణ కేసులు మొదలుకుని.. అరుదైన కేసుల చేధనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. చోరీ కేసులు మొదలుకుని.. అత్యాచారం, హత్యల వరకు కేసు ఏదైనా వినూత్న రీతిలో చేధిస్తూ.. మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిస్సింగ్ కేసులను సైతం ఒక్కొక్కటిగా చేధిస్తూ బాధిత కుటుంబాల్లో ఆనందం నింపుతూ ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా మహిళను పెళ్లి చేసుకుని మోసం చేసి విదేశాలకు పారిపోయిన యువకుడిని […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: అది నల్లగొండ జిల్లా పోలీసు శాఖ. సాధారణ కేసులు మొదలుకుని.. అరుదైన కేసుల చేధనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. చోరీ కేసులు మొదలుకుని.. అత్యాచారం, హత్యల వరకు కేసు ఏదైనా వినూత్న రీతిలో చేధిస్తూ.. మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిస్సింగ్ కేసులను సైతం ఒక్కొక్కటిగా చేధిస్తూ బాధిత కుటుంబాల్లో ఆనందం నింపుతూ ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా మహిళను పెళ్లి చేసుకుని మోసం చేసి విదేశాలకు పారిపోయిన యువకుడిని సైతం స్వదేశానికి రప్పించి తాటతీసిన అరుదైన ఘటన నల్లగొండ మహిళా పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా పెళ్లి పేరుతో మహిళలను మోసం చేసి విదేశాలకు చెక్కేసే యువకుల కేసులను చేధించడం కొంతమేర కష్టమనే చెప్పాలి. విదేశాల నుంచి మోసం చేసిపోయిన యువకుడు తిరిగి వచ్చేవరకు పెండింగ్‌లో ఉండే పరిస్థితి. కానీ అలాంటి ఓ కేసును నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్ సిబ్బంది చేధించిన తీరు, నల్లగొండ జిల్లా పోలీసు శాఖ ఇటీవల చేధించిన మిస్సింగ్ కేసులపై ‘దిశ’ ప్రత్యేక కథనం..
యువకుడిని ఆస్ట్రేలియా నుంచి రప్పించి..
నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన మందుగుల బిందుశ్రీ గతేడాది ఆగస్టు 6న ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన మందుగుల సురేశ్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. కట్నాకానుకలు సైతం అమ్మాయి కుటుంబ సభ్యులు ఇచ్చేశారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుని మళ్లీ వచ్చి ఆస్ట్రేలియాకు బిందుశ్రీను తీసుకెళ్తానని నమ్మించాడు. బిందుశ్రీని అత్తవారింట్లో ఉంచి సురేశ్ ఆస్ట్రేలియాకు చెక్కేశాడు. మళ్లీ వచ్చి తీసుకెళ్తానన్న సురేశ్.. నెలలు గడుస్తున్నా జాడలేకుండా పోయాడు. దీనికితోడు అదనపు కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు రోజురోజూకీ ఎక్కువయ్యాయి. దీంతో ఇటీవల బాధిత మహిళ బిందుశ్రీ నల్లగొండ మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నల్లగొండ జిల్లా ఎస్పీ, డీఐజీ రంగనాథ్ సహకారంతో నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగి కేసును చేధించారు.
కేసు చేధించిన క్రమమిదీ..
రంగంలోకి దిగిన నల్లగొండ మహిళా పోలీసు సిబ్బంది మొదటగా… నిందితుడు సురేశ్ పాస్‌పోర్ట్ సీజ్ చేసేలా పాస్‌పోర్ట్ కార్యాలయానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, జిల్లా పోలీసుల ద్వారా ఇండియన్ ఎంబసితో పాటు ఆస్ట్రేలియా ఎంబసీకి సైతం ఈ మెయిల్స్ పంపించారు. ఎల్ఓసీ లేఖలు పంపడంతో పాటు సురేశ్ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ కంపెనీ వివరాలను సైతం సేకరించి సురేశ్ ప్రవర్తన, అతడిపై నమోదు చేసిన కేసు వివరాలను సమగ్రంగా పేర్కొంటూ సంబంధిత కంపెనీ సిఇఓకు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ మెయిల్ పంపించారు. సీఐ రాజశేఖర్ స్వయంగా ఎంబసీ అధికారులు, సాఫ్ట్‌వేర్ కంపెనీతో ఫోన్లో మాట్లాడి నిందితుడిని ఇండియాకు తీసుకువచ్చేలా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. సురేశ్ వ్యవహార శైలిని మెయిల్ ద్వారా తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు సురేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించి అక్కడి ఎంబసీ అధికారులకు సమాచా రం ఇచ్చారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 2న ఆస్ట్రేలి యా నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చిన సురేశ్‌ను సీఐ రాజశేఖర్ గౌడ్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లి ఇమిగ్రేషన్, ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నల్లగొండకు తీసుకువచ్చి బాధితురాలికి న్యాయం చేయడంలో కొత్త రికార్డు సృష్టించారు.
మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి..
ఎలాంటి సమస్యలున్నా.. వరకట్న వేధింపులు, అత్త, మామలు, కుటుంబ సభ్యులు, పోకిరీల వేధింపులు, మోసం చేసిన సందర్భాలు, లైంగిక వేధింపులు.. ఇలా ఏ రకమైన సమస్యలున్నా ధైర్యంగా తమకు సమాచారం ఇవ్వాలి. మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే ఖచ్చితంగా వారికి న్యాయం చేస్తాం.
– రాజశేఖర్ గౌడ్, సీఐ, మహిళా పోలీసు స్టేషన్