రోడ్డున పడ్డ 100 మంది జర్నలిస్టులు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి సుమారు వంద మంది జర్నలిస్టుల బతుకులు రోడ్డు మీద పడబోతున్నాయి. పత్రిక అభివృద్ధి కోసం ఏండ్లకేండ్లు అహర్నిషలు కష్టపడినా, కనికరం లేని యాజమాన్యం వారిని తట్టాబుట్టా సర్దుకొమ్మని సెలవిచ్చింది. నెలాఖరుకల్లా లెక్క చూసుకొమ్మంది. ఇంకేముంది? కంటి నిండా నీళ్లు తీసుకున్నా ఆ దయార్ద్ర హృదయాలు కరగడం లేదు. కరోనా కాలంలో ప్రింట్ పత్రికలే చదువుతలేరు. ఇక జీతాలు భరించే స్థోమత లేదంటూ ఉద్యోగాల ఊచకోత ప్రక్రియను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఆర్భాటంగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి సుమారు వంద మంది జర్నలిస్టుల బతుకులు రోడ్డు మీద పడబోతున్నాయి. పత్రిక అభివృద్ధి కోసం ఏండ్లకేండ్లు అహర్నిషలు కష్టపడినా, కనికరం లేని యాజమాన్యం వారిని తట్టాబుట్టా సర్దుకొమ్మని సెలవిచ్చింది. నెలాఖరుకల్లా లెక్క చూసుకొమ్మంది. ఇంకేముంది? కంటి నిండా నీళ్లు తీసుకున్నా ఆ దయార్ద్ర హృదయాలు కరగడం లేదు. కరోనా కాలంలో ప్రింట్ పత్రికలే చదువుతలేరు. ఇక జీతాలు భరించే స్థోమత లేదంటూ ఉద్యోగాల ఊచకోత ప్రక్రియను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఆర్భాటంగా చరిత్ర సృష్టించిన పత్రికలే జర్నలిస్టులకు అన్యాయం చేసేందుకు ఒడిగట్టడం మీడియా రంగంలో చర్చనీయాంశంగా మారింది.
పత్రికలో పెద్దలకేం ఢోకా లేదు. నోటీసులు అందుకోని.. ఉద్యోగాలు ఊడని మిగతా దిగువ శ్రేణి జర్నలిస్టులు కూడా ఉద్యోగాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. డెస్క్ జర్నలిస్టుల బతుకులను, వారి కుటుంబాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఉపాధిపరంగా నిలువునా చంపేస్తున్నారు. కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి అవకాశాల్లేని దుస్థితి నెలకొంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ దశాబ్దాలుగా సేవలు చేయించుకున్న యాజమాన్యాలు వద్దు పో అంటూ ముఖం మీదే చెప్పేస్తోంది. మరో వృత్తి తెలియని జర్నలిస్టు బతుకు మరోసారి రోడ్డున పడింది.
ఒకరిద్దరు కాదు.. ఒకే సంస్థలో వంద మంది ఈ నెలాఖరుకల్లా నిరుద్యోగులుగా మారనున్నారు. మీ బతుకు మీరు చూసుకోండని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ఎక్కడైనా మీడియా రంగంలో చిన్న కొలువైనా దొరుకుతుందేమోనని ఫైళ్లు పట్టుకొని పత్రికా ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. అన్ని పెద్ద మీడియా సంస్థలు అదే బాటన నడుస్తుండడంతో ఖాళీ కొలువులేవీ లేవంటూ గేట్లెత్తుస్తున్నాయి. మరో మార్గం లేక ఊరి బాట పడుతున్నట్లు సమాచారం.
దశాబ్దాలుగా మీడియా రంగంలో చేసిన సేవలకు ఆయా సంస్థల యాజమాన్యాలు చేసిన సన్మానాలను గుర్తు చేసుకుంటూ.. తిట్టుకుంటూ కుటుంబాన్ని పోషించేందుకు మార్గాలను వెతుక్కుంటున్నారు. ఓ ప్రధాన పత్రికా యాజమాన్యం డెస్క్జర్నలిస్టులను నిర్దాక్షిణ్యంగా తీసేందుకు పూనుకున్నది. అలాగే చిన్న జిల్లాల్లో స్టాఫ్ రిపోర్టర్లుగా చేస్తోన్న వారికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. స్టేట్బ్యూరోలోనూ స్ట్రెంత్‌ను తగ్గించేందుకు లెక్కలు వేస్తోంది. అందులో ఏ బీ సీ కేటగిరిలుగా విభజన చేసింది. సీ కేటగిరి వారిని ఇంటికే పంపేందుకు రాతపూతలు చేపట్టింది. బీ కేటగిరి జర్నలిస్టులకు బదిలీ లేదా బీట్ల మార్పులు అనివార్యంగా తేల్చింది. ఇక ఏ కేటగిరీలో అనూయులు.. మేనేజ్మెంట్లు ఉన్నారు.
చిన్న జిల్లాలే పెద్ద పాపం..
రాష్ట్రంలో చిన్న జిల్లాల పాలన వ్యవస్థ జర్నలిస్టుల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. అంతకు ముందేమో ప్రతి జిల్లాకో స్టాఫ్ రిపోర్టర్ అంటూ నియామకాలు చేపట్టారు. ఇప్పుడేమో నష్టాలను నెపంగా పెట్టి అవసరం లేదు.. వెళ్లిపో అంటున్నారు. అందులో సీనియర్లు ఉన్నారు.. వృత్తినే నమ్ముకొని వచ్చిన జూనియర్లు ఉన్నారు. ప్రధాన పత్రికలన్నీ జిల్లాకో టాబ్లాయిడ్ అంటూ తీసుకొచ్చాయి. దానికి అవసరమైన సిబ్బందిని తీసుకున్నాయి. ఇప్పుడేమో పేజీలు తగ్గించాయి. కొన్నేమో టాబ్లాయిడ్లను ఎత్తేశాయి. ఇంకొన్నేమో మెయిన్‌లోనే కలిపేశాయి. ఇక పేజీలే లేవు.. డెస్క్ జర్నలిస్టులెందుకు? పెట్టే వార్తల సంఖ్య తగ్గినప్పుడు జీతాలు తీసుకునే జర్నలిస్టులు ఎందుకంటూ వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. అన్ని రకాల లాభాల బాటన నడుస్తోన్న పత్రికా యాజమాన్యాలే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుంటే ఇక.. జర్నలిస్టు బతుకు ఏం కావాలి..?