సీఎం జగన్ సొంత జిల్లాలో కరువు ఛాయలు!
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో
దిశ ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో తీవ్ర కరువు ఛాయలు అలుముకున్నాయి. గత ఐదారు ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది కనిపిస్తున్నాయి. వర్షాభావం, ప్రాజెక్టులకు చాలినంత నీటి సరఫరా లేక సాగు భూములన్నీ బీడుగా మారిపోయాయి. అయినా, అంతా బాగానే ఉందని అధికారులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూనే, 17 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదికలు పంపడం గమనార్హం.
జిల్లాపై నైరుతి రుతు పవనాలు కరుణించక పోయినా, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురిసేవి. ఈ సారి వాన జాడే లేకుండా పోయింది. తీవ్ర వర్షాభావం, మరోవైపు శ్రీశైలం నీరు రాకపోవడంతో, జిల్లాలోని 95 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన ప్రధాన సాగు నీటి వనరు అయిన కేసీ కెనాల్‌కు చుక్క నీరు లేకుండాపోయింది. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు బ్రహ్మ సాగర్ నుంచి కూడా నీరు వదలకపోవడంతో, చెరువులు, చిన్నచిన్న ప్రాజెక్టులు ఎండిపోయాయి. ఇదే కాకుండా గండికోట రిజర్వాయర్, దాన్ని ఎత్తిపోతల పథకాలు, సర్వాయి సాగర్, వామికొండ ప్రాజెక్టుల కింద కూడా ఖరీఫ్ సాగు తగ్గింది. ఈ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బీడు భూములు దర్శనమిస్తున్నాయి.
నివేదిక పంపినా స్పందన శూన్యం
జిల్లాలో మొత్తం 36 మండలాలు ఉండగా, 17 మండలాల్లో కరువు ఉందని అధికారులు తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయినా, స్పందన లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలు సీఎం సొంత జిల్లాలో కరువు లేదన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లాలోనూ అంతే...
రాష్ట్ర వ్యాప్తంగా 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం కడప తో పాటు విభజిత అన్నమయ్య జిల్లా పైన కూడా కరుణ చూపలేదు. ఈ జిల్లాలోని 30 మండలాల్లో 23 మండలాల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 18 మండలాల్లో కరువు నెలకొందని అధికారులు ప్రతిపాదన పంపారు. ఇందులో గాలివీడు, చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గుర్రంకొండ, కలకడ , ఖమ్మవారిపల్లి, పీలేరు, టి.సుండుపల్లి, వీరబల్లి, తంబళ్లపల్లి, పెద్దమండెం, కొరకులకోట, పెద్ద తిప్ప సముద్రం, బోరంగి కొత్తపేట, నందలూరు, పెనుగూరు మండలాలు ఉన్నాయి.
రైతుకు ద్రోహం..
వైయస్సార్ కడప జిల్లాలో కరువు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం ఇక్కడి రైతులకు ద్రోహం చేయడమే. బోర్ల కింద సాగవుతున్న అరకొర పంటలు కూడా చేతికి రాని దుస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లాలో గత నెల 5 ,6 తేదీల్లో సీపీఐ బృందం పర్యటించింది. ప్రభుత్వం రైతును ఆదుకోవాల్సింది పోయి ఉన్న కరువును కూడా లేదని మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గం- గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి