పూర్తి మ్యానిఫెస్టో వస్తే వైసీపీ దుకాణం బంద్.. Nara Lokesh
టీడీపీ పూర్తి మ్యానిఫెస్టో వస్తే వైసీపీ దుకాణం బంద్ అవుతుందని నారా లోకేశ్ అన్నారు.
దిశ ప్రతినిధి, కడప: మహానాడు మినీ మ్యానిఫెస్టోకే వైసీపీ నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారని, ఇక పూర్తి మ్యానిఫెస్టో వస్తే వారి దుకాణం బంద్ అవుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ 111 వ రోజు మంగళవారం జమ్మలమడుగు పట్టణం సంజామాలమోటులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. హామీలు అన్ని ఎలా అమలు చేస్తారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారన్నారు. పేటీఎమ్ డాగ్స్ అన్ని రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నాయన్నారు. జగన్ అప్పుల అప్పారావని, మా చంద్రన్న సంపద సృష్టికర్త అని అన్నారు. జగన్ది దొబ్బే గుణం.. చంద్రన్నది పెట్టే గుణమని పేర్కొన్నారు. జగన్ మోసగాడని చంద్రన్న మొనగాడని పేర్కొన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయని మోసగాడు జగన్ అని అందుకే పేరు మార్చి మోసగాడు అని పేరు పెట్టానని తెలిపారు. మోసగాడు జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. నిషేదం లేకపోగా బూమ్ బూమ్, గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్ లాంటి జే బ్రాండ్లు తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడని ప్రశ్నించారు.
రూ.2500 కోట్ల అభయహస్తం నిధులు దొబ్బేశారు
45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అని జగన్ చెప్పారన్న లోకేశ్.. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2,500 కోట్లు కొట్టేశాడని, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేశాడని ఆరోపించారు. మీ కష్టాలు తెలుసుకున్న తరువాత మీ అన్న చంద్రన్న మహాశక్తి పథకం కింద పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారన్నారు. మహాశక్తి పధకంక్రింద ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. , తల్లికి వందనం క్రింద ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు, దీపం పథకం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇస్తామని ప్రకటించారని అన్నారు. జగన్ ఆర్టీసీ టికెట్ ధర పెంచితే మీ చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యాలని అనుకుంటున్నారన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదని గ్రూప్2 లేదు, డీఎస్పీ లేదని అన్నారు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడని , జీవో 77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేశాడని అన్నారు.
20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?
ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదన్నారు.
బాబాయ్ ఆత్మ వెంటాడుతోంది
బాబాయ్ మర్డర్ కేసులో అరెస్ట్ కాకుండా కాపాడాలని ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఎన్ని కాళ్లు పట్టుకున్నా బాబాయ్ ఆత్మ నిన్ను వెంటాడుతుంది జగన్ అంటూ హెచ్చరించారు లోకేశ్.
సుధీర్ జాతకం మారింది
2019 ఎన్నికల్లో జమ్మలమడుగు జాతకం మార్చేస్తాడు అని భారీ మెజారిటీ తో మూలె. సుధీర్ రెడ్డిని గెలిపించారని, సుధీర్ రెడ్డి జాతకం మారింది కానీ జమ్మలమడుగు జాతకం మారలేదన్నారు. సుధీర్ రెడ్డి ఉదయం రెండు సూట్ కేసులతో బయటకి వెళ్తాడు. ఒకటి ఖాళీ సూట్ కేసు, రెండోవది బీర్ కేసు. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి బీర్ కేసు ఖాళీ అవుతుంది, సూట్ కేసు ఫుల్ అవుతుందన్నారు. ఎన్నికల ముందు వేసుకున్న చొక్కా, బనియన్ నాది కాదు, నేను ఒక చిన్న డాక్టర్ ని అని చెప్పిన సుధీర్ రెడ్డి మాట మార్చాడు. ఇప్పుడు మాది జమిందారీ కుటుంబం అంటున్నాడు. ఇన్ని కోట్ల ఆస్తి సడన్ గా ఎలా వచ్చిందని లోకేష్ ప్రశ్నించారు.
బాబాయ్ మర్డర్ కేసులో నిందితులకు డబ్బులు ఇవ్వడం దగ్గర నుండి ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీ, పరిశ్రమల నుండి నెలనెలా కమిషన్, వెంచర్లు వేసే వారి దగ్గర కమిషన్లు, ఉద్యోగస్తుల ట్రాన్సఫర్లలో కమిషన్, ఆఖరికి చీప్ గా చికెన్ షాపులు, మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర కూడా కమిషన్లు తీసుకుంటున్నారు. సుధీర్ రెడ్డి చరిత్ర తెలుసుకున్న తరువాత ఆయన పేరు మార్చాను అన్నారు. ఆయన డాక్టర్. సుధీర్ రెడ్డి కాదు యాక్టర్. సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు తెదేపా ఇంచార్జ్ సి భూపేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సి నారాయణ రెడ్డి, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.