Viveka Case: వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ డిస్మస్
మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది....
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా గుర్తించాలని...తన అర్హతపై స్పష్టత ఇవ్వాలని వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఇరువాదనలు విన్న జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం కృష్ణారెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే వదిలేస్తూ ఆదేశాలిచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఈనెల 6న తెలంగాణ హైకోర్టుకు పంపుతామని తెలిపింది.
కాగా దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని హైకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఏపీ నుంచి తెలంగాణకు కేసును బదిలీ చేస్తూ వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె వైఎస్ సునీతారెడ్డిలను నిజమైన బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరన్నదానిపై సుప్రీంకోర్టులో స్పష్టత తీసుకోవాలని ఎంవీ కృష్ణారెడ్డికి హైకోర్టు సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌పై స్పష్టత ఇవ్వకుండా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోడానికి సిద్ధంగా లేమని జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలంగాణ హైకోర్టు ముందే చెప్పుకోవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.