మాట తప్పిన జగన్.. మరో మాజీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..!

పల్నాడు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది....

Update: 2025-01-04 02:00 GMT

దిశ, నరసరావుపేట ప్రతినిధి: పల్నాడు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌లో పేరు ప్రఖ్యాతులు పొందిన చిలకలూరిపేట దివంగత ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య సొంత అల్లుడే మర్రి రాజశేఖర్.

కాంగ్రెస్ ప్రభంజనంలోనూ..

2004లో చిలకలూరిపేట నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసి కాంగ్రెస్ ప్రభంజనంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. వివాద రహిత రాజకీయాలను నడిపారు. అవినీతికి దూరంగా ఉంటారన్న పేరు తెచ్చుకున్నారు. 2009 తరువాత రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పుతో వైసీపీలో చేరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. 2019లో ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా విడదల రజనికి టిక్కెట్ ఇచ్చారు. ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వైసీపీలో, నియోజకవర్గంలో ఆయన్ను, ఆయన అనుచర బృందాన్ని అనేక విధాలుగా అవమానాల పాలు చేశారు. అయినా, ఎన్నడూ పార్టీ అధిష్టానానికి విధేయుడిగానే ఉన్నారు.

మాట తప్పిన జగన్..

2019లో రజనిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మర్రిని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానని బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ ఎన్నికల్లో రజిని గెలిచినప్పటికీ రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి వెంటనే ఇవ్వలేదు. 2024 ఎన్నికలకు కొద్దికాలం ముందు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు మారినా మర్రికి గానీ, ఆయన కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వలేదు.

టీడీపీలో చేరాలని అనుచరుల ఒత్తిడి..

వైసీపీ రాజకీయాలతో విసుగు చెందిన పలువురు టీడీపీలో చేరి పత్తిపాటి పుల్లారావును గెలిపించారు. గుంటూరు పశ్చిమలో ఓడిపోయిన విడదల రజనీని తిరిగి చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జ్ గా వైసీపీ ఇటీవల నియమించారు. దీంతో మర్రి, ఆయన అనుచరులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. టీడీపీలో చేరాలని ఆయనపై ఒత్తిడి పెంచారు. అనుచరులు, బంధువుల ఒత్తిడితో ఆయన కూడా టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే టీడీపీలో చేరాలని ఎన్నికల ముందు నుంచే ఆయనకు ఆహ్వానం ఉన్నట్లు సమాచారం. మర్రి టీడీపీలో చేరటంపై ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News