YS Jagan తిరుమల పర్యటన.. డిక్లరేషన్‌పై తీవ్ర ఉత్కంఠ

Update: 2024-09-27 03:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు (శుక్రవారం) తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లనున్న విషయం తెలిసిందే. తిరుపతి లడ్డూ (Tirupati Laddu) ప్రసాదం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తిరుమలలో అన్యమతస్థుల డిక్లరేషన్ అంశం కూడా చర్చనీయాంశమవుతోంది. టీటీడీ రూల్స్ ప్రకారం.. ఇతర మతాలకు చెందిన వారు ఎవరైనా శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కచ్చితంగా అఫిడవిట్‌ (Affidavit) సమర్పించాలి. దేవాదాయశాఖ చట్టం 30/1987 ప్రకారం 1990లో అప్పటి ప్రభుత్వం ఇదే విషయంపై ప్రత్యేకంగా ఓ జీఓను సైతం విడుదల చేసింది. హిందువులు కాని వారు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా ‘‘నేను వేరే మతాన్ని ఆచరించే వ్యక్తిని. అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చాను. నన్ను దర్శనానికి అనుమతించండి’’ అని కోరుతూ డిక్లరేషన్‌ ఫారంపై సంతకం పెట్టాలనేది ఈ జీవో సారాంశం. ఈ ఫారంలోనే వ్యక్తిగత వివరాలను పొందుపరిచి సంతకం చేయాల్సి ఉంటుంది.

అయితే గత ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ డిక్లరేషన్‌ను అనుసరించలేదు. డిక్లరేషన్ (Declaration) ఇవ్వకుండానే పలుమార్లు తిరుమలకు వెళ్లారు. హిందూ సంఘాలు, టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అందరూ దీన్ని వ్యతిరేకించినా.. డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్లు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగడంతో నాటి చైర్మన్‌తోపాటు కొంతమంది మంత్రులు విపక్షాలపై బూతులతో విరుచుకుపడ్డారు.

కాగా..ఇప్పుడు అటు అధికారం లేకపోవడంతో పాటు లడ్డూ కల్తీ వివాదం వెంటాడుతుండడంతో ఈ దఫా జగన్ కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేలా ఉంది. డిక్లరేషన్‌పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలంటూ ఇప్పటికే అనేకమంది నేతలు, హిందూ సంఘాలు ఈఓకు విజ్ఞప్తి చేయడం జరిగింది.

దీనికి తోడు తప్పు చేశామని జగన్ ఒప్పుకున్న తర్వాతే అలిపిరి నుంచి ముందుకు వెళ్లనిస్తామని, లేదంటే తిరుమలలో అడుగుపెట్టనివ్వమని బీజేపీ భానుప్రకాష్‌రెడ్డి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో జగన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే వైఎస్ జగన్(YS Jagan) ఈ రోజు సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం(Renigunta Airport) నుంచి తిరుమలకు బయలుదేరుతారు. రాత్రి 7 గంటలకు జగన్ తిరుమలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. ఈ క్రమంలో రేపు (శనివారం) ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి(Tirumala Temple) వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు.


Similar News