‘దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. మేడిన్ ఏపీయే’
దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. అది మేడిన్ ఏపీయే అని తెలుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా.. అది మేడిన్ ఆంధ్ర ప్రదేశ్‌దే అని తెలుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో నారా లోకేశ్ శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విచ్చలవిడి గంజాయి లభ్యతపై గవర్నర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందంటూ.. అన్ని ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
‘వాలంటీర్లు స్థానిక నేతలతో కలిసి పనిచేయాలి’
ఇటీవల వాలంటీర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో లోకేష్ స్పందించారు. వాలంటీర్లు స్థానిక నేతలతో కలిసి పనిచేయాలని సూచించారు. మళ్లీ కొత్తగా డేటా ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. వాలంటీర్ల వ్యవస్థను రాజకీయంగా వాడుకోకూడదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వం ఇష్టంమన్నారు. ముందస్తు ఎన్నికల గురించి ప్రభుత్వ సలహాదారులను అడగాలని, ముందస్తుకు వెళ్లేముందు అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.