పీఎంజీకేఏవై పథకం కింద ఏపీకి కలిగే లబ్ధి ఎంత..?: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కలిగే లబ్ధి ఎంత..? అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు కలిగే లబ్ధి ఎంత..? అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(PMGKAY) పథకంపై పలు ప్రశ్నలు వేశారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని మరో ఐదేళ్లకు పొడిగించడం వాస్తవమేనా? ఒకవేళ పొడిగిస్తే ఏపీలో ప్రయోజనం పొందబోయే వారిసంఖ్య ఎంత,? అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పథకం రూపొందించబడిందని, ఇప్పటివరకు కవర్ చేయని పేద ప్రజలకు ఈ పథకాన్ని విస్తరించాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వచ్చాయా.?, ఆ డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అభ్యర్థనలను కేంద్రం అమలు చేయడంలో ఉన్న అడ్డంకులు ఏంటని కేంద్ర ప్ఱభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కరోనా కారణంగా పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రధాన్‌మత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) పథకాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఉచిత ఆహార ధాన్యాల కేటాయింపునకు ఇది అదనమని తెలిపారు. 28 నెలల కాలానికి సుమారు రూ. 3.91 లక్షల కోట్ల విలువ గల సుమారు 1118 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు కేటాయించబడ్డాయన్నారు. PMGKAY కింద అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డుదారులకు, ఇతర ప్రాధాన్యతా గృహాలకు ఆహార ధాన్యాలను ఉచితంగా 1 జనవరి 2023 నుంచి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా వచ్చే అయిదేళ్ల కాలానికి దేశంలోని 81.35 కోట్ల మంది ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇది వచ్చే జనవరి 1, 2024 నుంచి ప్రారంభం అవుతుందని, విలువ రూ. 11.80 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PMGKAY పథకం కింద 2.68 కోట్ల మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని జనాభా అంచనా ఆధారంగా నిర్ణయించడం జరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు.