YS Sharmila:‘రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే కావాల్సింది అదే’.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
ఏపీలో ఇటీవల సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్డెస్క్: ఏపీలో ఇటీవల సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. స్వర్ణాంధ్ర విజన్-2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ దశ, దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదు. విభజన హామీలు, రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు, దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారు. పూర్తిగా అటకెక్కించారు అని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో UPA సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. నూతన రాజధానికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ఇవ్వాలని సూచించింది.
బుందేల్ ఖండ్ తరహాలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటన చేసింది. మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని షెడ్యూల్ 13 లో పొందుపరిచింది. కడప స్టీల్, దుగ్గరాజుపట్నం పోర్టులను నిర్మిస్తామని విభజన చట్టంలో పొందుపరిచింది. నూతన రైల్వే జోన్, పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్, హైదరాబాద్ నుంచి విజయవాడకు ర్యాపిడ్ రైల్, ఇలా ఎన్నో హామీలు నేటికీ కలగానే మిగిలాయి. ఇవ్వాళ్టికి ఒక్క హామీకి దిక్కు లేకుండా పోయింది. గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పన్నుల్లో రాయితీలు ఉండేవి. వేల సంఖ్యలో కొత్త పరిశ్రమలు వచ్చేవి. లక్షల్లో ఉపాధి అవకాశాలు లభించేవి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ నిర్మాణం జరిగితే ప్రధాన నగరాలుగా అభివృద్ధి చెందేవి అని ఆమె అన్నారు.
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు అంది ఉంటే పేదరిక నిర్మూలన సాధ్యం అయ్యేది. విభజన హామీలు అమలు అయి ఉంటే రాష్ట్రం దిశ, దశ పూర్తిగా మారేదని తెలిపారు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేది. 25 మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇవ్వరో చూస్తా అని శపథాలు చేసిన జగన్ గారు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎప్పటికైనా రాష్ట్ర అభివృద్ధికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే రాష్ట్రానికి విజన్. విభజన హామీలపై ప్రధానిని నిలదీయండి. కేంద్రం గల్లా పట్టి రాష్ట్ర హక్కులను సాధించండి అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.