‘ఆయిల్ పామ్ కు తెలంగాణ ధర ఇవ్వండి’.. రైతు సంఘం డిమాండ్
ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణలో ఇచ్చినట్లు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
దిశ, ఏలూరు: ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణలో ఇచ్చినట్లు గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు పవర్‌పేటలోని అన్నే భవనంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ టన్ను కి ఇచ్చే ధర తెలంగాణ కంటే ఆంధ్రాలో తక్కువ ఉండడంతో ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టన్ను ఆయిల్ పామ్ గెలలు ఉత్పత్తికి రైతులకు రూ.18 వేలు ఖర్చు అవుతుంటే సెప్టెంబర్‌లో టన్ను గెలలకు రూ.14,590, ఆగస్టు నెలలో రూ.13,883 మాత్రమే రైతుకు ధర వచ్చిందని చెప్పారు. అక్టోబర్‌లో తెలంగాణలో రూ.17,040 ఆయిల్ పామ్ గెలలకు ధర ప్రకటిస్తే, ఇంతవరకు ఆంధ్రాలో ధర పై స్పష్టత లేదన్నారు. ఆయిల్ పామ్ కంపెనీలో ఇష్టారాజ్యంగా తయారైందని విమర్శించారు.
రాష్ట్రంలో 5 లక్షల 60 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణం ఉండగా అత్యధికంగా సాగు విస్తీర్ణం ఏలూరు జిల్లా పరిధిలోనే ఉందన్నారు. ప్రభుత్వాలు పెదవేగిలో ఉన్న ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్వీర్యం చేసిన ఫలితంగా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు(ఓ.ఈ.ఆర్) తక్కువ చూపడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచిన ఫలితంగా ఆయిల్ పామ్ గెలలకు కొంచెం ధర పెరుగుతున్నా వాస్తవ ఖర్చులకు అనుగుణంగా ఆయిల్ పామ్ గెలలకు ధర పెరగడం లేదన్నారు. టన్ను ఆయిల్ పామ్ గెలలకు రూ.18 వేలు ధర అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ఆధునిక రించాలని కోరారు. ఆయిల్ పామ్ రైతులు భ్రమలకు లోను కాకుండా రాజకీయాలకు అతీతంగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.