సంక్రాంతి వేళ వరి రైతు పరిస్థితి మరీ ఇంత దారుణమా..!
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా గత ఖరీఫ్‌లో 58,263 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. వీటికి గాను అధికారిక లెక్కల ప్రకారం సరాసరి 2.33 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ...
- ఖరీఫ్‌లో 2.33 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి
- ప్రభుత్వం ఇప్పటివరకు 4 శాతం కొనుగోలు
- వీటిలోనూ 10 శాతానికే పూర్తయిన చెల్లింపులు
- నిబంధనల పేరుతో కొనుగోలుకు సిబ్బంది వెనుకంజ
- మరీ ధరలు తగ్గించి కొంటున్న ప్రైవేటు వర్తకులు
'అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినా తిననివ్వదు' అన్నట్టుంది ఏపీ ప్రభుత్వ పరిస్థితి. పండిన ప్రతి ధాన్యం గింజా కొంటామన్న ప్రభుత్వం.. నేడు నిబంధనల పేరుతో కొర్రీలు వేస్తూ ముఖం చాటేస్తోంది. దీన్ని అలుసుగా తీసుకుంటున్న ప్రైవేటు వర్తకులు క్వింటాకు 30శాతం వరకు తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు.. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో పండిన ధాన్యంలో ఇప్పటివరకు కొనుగోలు చేసింది కేవలం 5 శాతమే. వీటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు చేసింది పది శాతమే. ఇలాంటి పరిస్థితుల వల్ల కల్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
దిశ, ఉత్తరాంధ్ర (అల్లూరి జిల్లా): అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా గత ఖరీఫ్‌లో 58,263 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. వీటికి గాను అధికారిక లెక్కల ప్రకారం సరాసరి 2.33 లక్షల టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ప్రైవేటు వర్తకుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావించిన ప్రభుత్వం మొత్తం ధాన్యం ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే అనుకోని విధంగా కోతల సమయంలో అల్పపీడనం ఏర్పడి, అకాల వర్షాలు కురిశాయి. దీంతో కొంతమంది కోసిన పంటను పొలంలోనే వదిలేయగా, మరికొంత మంది భయంతో తడిచిన పనలతోనే కుప్పలు వేసుకున్నారు. ఇంకొందరు పంటను కోయకుండా వదిలేశారు. ఈ వర్షాల ప్రభావం పది రోజుల వరకు ఉండటంతో ఎవరెన్ని విధాలుగా ప్రయత్నించినా చివరకు పంట తడిచి, ధాన్యం రంగు మారడంతో అన్ని రకాలుగా దెబ్బతింది.
కేంద్ర ఫుడ్ కార్పోరేషన్ విధించిన నిబంధనలకు అనుగుణంగా ఆహార ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే అనుకోని విధంగా వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులు నష్టపోకుండా కొన్ని సడలింపులు చేసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రభుత్వం కేవలం వర్షాలు వచ్చిన సమయంలో పనలపై పొలంలో ఉన్న రైతులకు మాత్రమే కొన్ని ప్రయోజనాలు కల్పించే విధంగా నిర్ణయించింది. నర్సీపట్నం మండలం, గబ్బాడ క్లస్టరు పరిధిలో మొత్తం 430 మంది రైతులు 380 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, వీరిలో కేవలం 8 మంది మాత్రమే ఈ షరతులకు లోబడి, జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ విధంగా చూస్తే జిల్లా రైతాంగం మొత్తంలో సుమారుగా పది శాతం మంది రైతులు మాత్రమే పరోక్షంగా లబ్ధిపొందారు. తడి పనలతో కుప్పలు వేసి, కోయని పంట నేలకొరగడం వల్ల దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.
ఇవీ నిబంధనలు :
- 17 శాతానికి మించి తేమ ఉండకూడదు.
- లేనిపక్షంలో ఎండబెట్టుకుని తీసుకురావాలి.
- రంగు మారిన ధాన్యం 5 శాతం వరకు అనుమతి
- పనల స్థాయిలో నష్టపోయిన బాబితాలో ఉంటే కొంతమేర సడలింపు
- లేనిపక్షంలో అధికారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు.
- చెత్త, తాలు ఒక శాతం, ప్లాస్టిక్ వంటి అసేంద్రీయాలు ఒక శాతం వరకు మాత్రమే ఉండాలి.
- రైతు భరోసా కేంద్రాల సాంకేతిక సలహాలతో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు
- కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లో చెల్లింపులు
క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి...
తడి పనలతో కుప్పలు వేయడం వల్ల పంట మరింత దెబ్బతిని రంగు మారింది. కోయకుండా వదిలేసిన పంట వర్షాలకు కింద పడి ధాన్యం రంగు మారింది. ఈ రెండు నష్టాలను అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీనివల్ల కొన్నిసార్లు రైస్ మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని వెనక్కి తిప్పి పంపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5,911మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటికి ఇప్పటివరకు 61 లక్షలు చెల్లింపులు చేశారు. ఇంకా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 11.45 కోట్లు ఉంది. ఇలా కొంతమంది అమ్ముడుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది అధికారులు కొన్న ధాన్యానికి చెల్లింపులు లేక సతమతమవుతున్నారు.
ఈ విధంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో పలు షరతులను విధించిండం వల్ల ఖరీఫ్‌లో వచ్చిన దిగుబడిలో ఇంతవరకు కొనుగోలు చేసింది కేవలం 5 శాతమే. ప్రైవేటు వర్తకులు కొనుగోలు చేయకూడదనే నిబంధన ఉన్నా అక్కడక్కడా చాటుమాటున వ్యాపారం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయకపోవడం వల్ల రంగు మారిందనే సాకుతో క్వింటాకు 4 నుంచి 5 వందల వరకు కోత విధిస్తున్నారు. ఇలా ప్రభుత్వం విధించిన నిబంధనల వల్ల అధిక శాతం ఉత్పత్తులు కొనుగోలుకు నోచుకోలేదు. ఇప్పటికే అమ్మకం చేసిన వారికి సైతం చెల్లింపులు చేయకపోవడం వల్ల ఏమి చేయాలో పాలుపోక జిల్లాలోని రైతులంతా తలలు పట్టుకుంటున్నారు.