పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలి: కలెక్టర్
జిల్లాలో పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.
దిశ ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో పోలింగ్ కేంద్రాలను ఖరారు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు.ఇఆర్ఓ స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకొని తుది జాబితాను తయారు చేయాలన్నారు. కొత్తగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి.. ఉన్న వాటిని రద్దు చేయడానికి అవకాశం లేదని, కేవలం ఒకే ప్రాంగణంలో ఉండి వేరొక భవనంలోకి మార్చడానికి మాత్రమే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ తన ఛాంబర్‌లో బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్ స్టేషన్ల ఖరారు, ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులు, ఫిర్యాదులపై తీసుకున్నచర్యలపై చర్చించారు. ఎన్నికల ప్రచారానికి మైనర్ బాలబాలికలను ఎట్టి పరిస్థితిలోనూ వినియోగించకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసి, జాబితాను మార్చి 5వ తేదీలోగా పంపించాలని ఆదేశించారు.
జిల్లా ఓటర్ల జాబితాలో పెద్దగా మార్పులు లేవని అన్నారు. ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ముమ్మరం చేస్తామన్నారు. దీనికోసం త్వరలో స్వీప్ ప్రణాళికను వెళ్లడిస్తామని, స్కిట్‌లను, షార్ట్ ఫిల్ములను రూపొందిస్తామని చెప్పారు. ముఖ్యంగా యువ ఓటర్లపై దృష్టి పెట్టి చైతన్యవంతం చేస్తామన్నారు. సున్నిత ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజల్లో ధైర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. లక్ష్మీపురం, మల్యాడ, ముంజేరు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. వివి ప్యాట్‌ల పనితీరుపైనా ఓటర్లకు వివరించడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.
ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు రొంగలి పోతన్న, కుటుంబరావు, సోములు, ఇఆర్ఓలు, ఎన్నికల డిటిలు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
Read more..