Narsipatnam: రసాభాసగా కౌన్సిల్ సమావేశం
నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా జరిగింది. ..
దిశ, నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా జరిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగులకు రోడ్డు విస్తరించాలని మున్సిపాలిటీ ఎజెండాలో పేర్కొన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి రోడ్డు విస్తరణకు తమ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని చెప్పారు. అయితే రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్ బాండ్ల వల్ల ప్రయోజనం లేదని, నగదు రూపంలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు, మాక్రెడ్డి బుల్లిదొరలు మాట్లాడుతూ టీడీఆర్ బాండ్లు ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమేనని, దానినే తాము అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ విషయమై చైర్‌పర్సన్ ఆదిలక్ష్మీ జోక్యం చేసుకుంటూ అసలు మున్సిపాలిటీలో ఏమి జరుగుతుందో తనకు సమాచారం లేదని, సమావేశం ఎజెండా కూడా ముందు రోజే ఇచ్చారన్నారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య మాట్లాడుతూ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, మహాశివరాత్రి సందర్భంగా మున్సిపాలిటీ చేసిన ఏర్పాట్లకు రూ.10 లక్షల బిల్లులు పెట్టారని, అసలు అంత ఖర్చు జరగలేదని, మున్సిపాలిటీ నిధులను దోచేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 20వ వార్డు టీడీపీ కౌన్సిలర్ రామరాజు తన వార్డుల సమస్యలపై బ్యానర్లను ప్రదర్శించారు.