‘ఇల్లొదిలి..ఊరొదిలి’..బంధువుల గ్రామాలకు వెళుతున్న వరద బాధితులు
బెజవాడ నగరం ఖాళీ అవుతోంది. తమ ఇళ్లను ఖాళీ చేసి బాధితులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
దిశ,డైనమిక్ బ్యూరో:బెజవాడ నగరం ఖాళీ అవుతోంది. తమ ఇళ్లను ఖాళీ చేసి బాధితులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. వరద నీరు పోవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉండడంతో తాగునీరు కూడా దొరక్కపోవడంతో బంధువుల ఇళ్లకు చేరుకుంటున్నారు. గత నాలుగు రోజులుగా వరదనీటిలోనే ప్రజలు మగ్గిపోయారు. వరద ప్రభావంతో విజయవాడలోని కొన్ని కాలనీల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దాదాపు నీళ్లలోనే ఉండిపోయారు. మొదట్లో వారికి ఎటువంటి సహాయం అందలేదు. ప్రభుత్వం టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్ల ద్వారా వారికి ఆహారాన్ని అందించింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారు పై అంతస్తులకు చేరారు. శివారులో ఉన్న పేదల తాత్కాలిక నివాసాలు అయితే కొట్టుకుపోయాయి.
తమకు ఉన్న ట్రాక్టర్‌లో కాలనీ దాటామని, నాలుగు రోజులుగా ఇందులోనే ఉంటున్నామని ఓ కుటుంబం ఆవేదన వెలిబుచ్చింది. మరి రెండు రోజుల పాటు నీరు, బురదలోనే ఉండాల్సి రావడంతో కొన్ని కుటుంబాల వారు ఇల్లు వదిలి తాళాలు వేసి బంధువులు ఊర్లకు వెళుతున్నారు. పూర్తిగా వరద నీరు పోయిన తర్వాత తిరిగి వస్తామని చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో వర్ష సూచనలు కూడా చెబుతుండడంతో వృద్ధులను బంధువుల ఇళ్లకు చేరుస్తున్నారు. పిల్లలను అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే మళ్లీ వరద వచ్చే పరిస్థితి లేదని, తాము అప్రమత్తంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. అయినా వరదతో భీతిల్లిన ప్రజానీకం కాలనీలను వదిలి వెళ్ళిపోతున్నారు.