ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. మే 3న నెరవేరనున్న చిరకాల స్వప్నం
మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు....
దిశ, ఉత్తరాంధ్ర: మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ఈ విమానాశ్రయానికి సేకరించిన భూములను ఆయన సందర్శించారు. ట్రంపెట్ రహదారి నిర్మాణం జరిగే ప్రదేశంతో పాటు సీఎం భారీ బహిరంగ సభ ప్రదేశాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తోందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమయ్యిందని అన్నారు. శంకుస్థాపన జరిపేందుకు అవసరమైన అన్ని రకాల లాంఛనాలను పూర్తి చేశామని చెప్పారు.
సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ ఎయిర్‌పోర్టుకు దాదాపు 2,195 ఎకరాల భూసేకరణ పూర్తి అయ్యిందని, మిగిలిన కొద్దిపాటి భూ సేకరణ కూడా త్వరలో పూర్తి కానుందని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. శంకుస్థాపన అనంతరం 24 నుంచి 30 నెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.