Visakhapatnam: ఎండలో చిన్నారులకు చెప్పులు లేకుండా నిలబెట్టిన టీచర్
ఆ చిన్నారులను చూస్తే ఎవరికైనా ముద్దాడాలనిపిస్తుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆ చిన్నారులను చూస్తే ఎవరికైనా ముద్దాడాలనిపిస్తుంది. ఒకవేళ ఆ చిన్నారులు తెలిసి తెలియక ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా పెద్దలుగా సరిదిద్దాలి. అందులోనూ టీచర్ అయితే ఇక అలాంటివి మరోసారి చేయకుండా ఉండేందుకు వారికి అర్థవంతమైన రీతిలో చెప్పాలి. కానీ ఓ టీచర్ అందుకు భిన్నంగా ప్రవర్తించారు. చిన్నారులను ఎండలో చెప్పులు లేకుండా నిల్చబెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం సీతమ్మధారలో వెలుగులోకి వచ్చింది. సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చిన్నారులను చెప్పులు లేకుండా ఎండలో నిలబెట్టి చదవమని పనిష్మెంట్ ఇచ్చింది. నడిరోడ్డుపై గేటు దగ్గర నిలబెట్టడంతో అంతా అవాక్కయ్యారు. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అంతే ఆ వీడియో వైరల్‌గా మారింది. రెచ్చిపోతున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. విద్యాశాఖ అధికారులు ఇలాంటి స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.